Non Vegetarianతెలంగాణ వాసులు మాంసాహారాన్ని ఎంత‌గా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పే అవ‌స‌రం లేదు. ఇంట్లో తాము చేసుకునే అన్ని వేడుక‌ల్లోనూ… ప్రధానంగా పెళ్ళిళ్ళ వంటి శుభకార్యాలలోనూ వారికి మాంసాహారం ఉండాల్సిందే. అందుకే, ‘నాన్ వెజ్’ ప్రియులుగా తెలంగాణ వాసులు దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలను వెన‌క్కి నెట్టేశారు. దీనిపై సర్వే జరిపిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) ఓ నివేదికను తయారుచేసింది.

తెలంగాణ‌లో మాంసాహారాన్ని తీసుకుంటోన్న వారి శాతం 98.7గా ఉంద‌ని ఎస్ఆర్ఎస్ తెలిపింది. ఈ రాష్ట్రంలో 98.7 శాతం మంది మాంసాహారాన్ని భుజిస్తార‌ని.., దేశంలో మాంసాహారాన్ని తీసుకునే వారి సంఖ్య‌లో తెలంగాణా మొద‌టి స్థానంలో ఉంద‌ని.., 2014లో నిర్వహించిన సర్వే ద్వారా రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధారంగా ఎస్ఆర్ఎస్ తెలిపింది. మాంసాహారం భుజిస్తున్న వారిలో తెలంగాణ త‌రువాత ప‌శ్చిమ బెంగాల్ ఉంద‌ని, ఆ రాష్ట్రంలో 98.55 శాతం మంది మాంసాహారం తీసుకుంటార‌ని ఎస్ఆర్ఎస్ తెలిపింది.

తెలంగాణ‌, బెంగాల్ త‌రువాత ఒడిశా, కేర‌ళ రాష్ట్రాల్లో వ‌ర‌స‌గా 97.35, 97 శాతం మంది ప్రజలు మాంసాహారాన్ని తీసుకుంటూ ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయ‌ని పేర్కొంది. గతంలో క‌న్నా మాంసాన్ని తినే వారి సంఖ్య గుజ‌రాత్‌లో 40 శాతం పెరిగిందని తెలిపింది. గుజ‌రాత్‌లో పురుషులు మాంసాహారాన్ని ఎంత‌గా తింటున్నారో అదే సంఖ్య‌లో స్త్రీలు కూడా తీసుకుంటున్నార‌ని పేర్కొంది. సదరు సమాచారంతో తెలంగాణా పేరు మరోసారి జాతీయ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. అయితే ఈ జాబితాలో అసలు ఆంధ్రప్రదేశ్ అడ్రస్ లేకుండా పోయింది. ఆ రాష్ట్రం చవిచూస్తున్న కరువును ప్రజలు కూడా అనుభవిస్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.