Telangana RTC Strike controversyతెలంగాణలో ఆర్టీసీ సమ్మె వివాదం కొత్త మలుపు తిరిగింది. పండగ పూట ప్రయాణికులను ఇబ్బంది పెట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసిన కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ షాక్ ఇచ్చారు. ఒక్కసారిగా దాదాపుగా 48,000 మంది ఉద్యోగం నుండి తొలగించారు. ఇప్పుడు సంస్థలో కేవలం 1200 మంది మిగిలారు. ఖాలీలను పూరించడానికి తొందరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు.

అయితే ఇది కార్మికులకు నెత్తిన పిడుగులా పరిణమించింది. స్వరాష్ట్రం కోసం పోరాటం చేసిన సమయంలో సకల జనుల సమ్మెలో భాగంగా ఆర్టీసీ పాత్ర ఎంతో కీలకం. తాము లేకపోతే రాష్ట్రం సిద్దించేది కాదు అలాగే తెరాస కూడా అధికారంలోకి వచ్చేది కాదు. తమను వాడుకుని ఇప్పుడు మోసం చేసారని కార్మికులు అంటున్నారు.

సమ్మె కాలం నాటి జీతాలు ఇస్తామని ప్రకటించినా ఇప్పటివరకు ఇవ్వలేదని వారు గుర్తించారు. అయితే 2015లో ఇచ్చిన 44% ఫిట్మెంట్ తో సరాసరి 50,000 జీతంగా అందుకుంటూ ఇంకా జీతం పెంచమనడం ఏంటని ప్రభుత్వ వాదన. 5000 కోట్ల అప్పుతో ఏడాదికి 1500 కోట్ల నష్టం మూటగట్టుకుంటున్న సంస్థ ఆదాయం గట్టిగా వచ్చే దసరా సమయంలో సమ్మె ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

2015లో ముందు ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 43% ఫిట్మెంట్ ప్రకటించారు. బాబు మీద పంతంతో 44% పెంచారు కేసీఆర్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ను ఫాలో అయ్యి ఇప్పుడు మాత్రం అక్కడి ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇక్కడ అదే డిమాండ్ తప్పు అని ఎందుకు అంటున్నారు అని కార్మికుల ప్రశ్న. ఏపీ లో సంస్థ పరిస్థితి దాదాపుగా తెలంగాణ ఆర్టీసీ వంటిదే.