Telangana Reservations-Bill-Passedతెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేపట్టిన తనను చూసి చాలా మంది నవ్వారని, కానీ, ఈ రోజున నవ్విన నాప చేనే పండిందన్నట్లుగా పరిస్థితి మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభివర్ణించారు. ముస్లిం, గిరిజన రిజర్వేషన్ బిల్లు అంశంపై తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన నేపధ్యంలో… గిరిజన, మైనార్టీ రిజర్వేషన్ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు.

‘ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్ల పెంపు బిల్లు తీసుకువచ్చాం. ఈ రిజర్వేషన్ల పెంపుతో బీసీలకు ఎలాంటి అన్యాయం జరగదు. బీసీ కమిషన్ నివేదిక తర్వాత బీసీల రిజర్వేషన్లు పెంచుతాం. ఈ బిల్లును 9వ షెడ్యూల్ లో పెట్టాలని కేంద్రాన్ని కోరుతున్నాము. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రానికే అధికారాలు ఇవ్వాలి. మేం మతపరమైన రిజర్వేషన్లు కల్పించడం లేదు.

సామాజిక వెనుకబాటు ఆధారంగానే రిజర్వేషన్ కల్పిస్తామని, రిజర్వేషన్ బిల్లు లోక్ సభ ముందుకు రాకపోతే కేంద్రాన్ని నిలదీస్తామని, అవసరమైతే లోక్ సభలో గొడవ చేస్తాం’ అని కూడా కేసీఆర్ తేల్చిచెప్పారు. కేసీఆర్ రాజకీయ విధానాలు చూస్తుంటే… తమిళనాట రాజకీయాలను ఒంట పట్టించుకున్నట్లుగా కనపడుతోంది. నయానో, భయానో తన రాష్ట్రానికి కావాల్సిన వాటిని తెచ్చుకోవడానికి ఇదే సరైన మార్గం అని భావించారేమో..!