Telangana-Pollingతెలంగాణ ఎన్నికల ఫలితాల ముందు అభ్యర్థులు, ప్రధాన పార్టీలలో ఇదే చర్చ. పోలింగ్ పూర్తయిన 28 గంటల తరువాత ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ ఓటింగు శాతాన్ని ప్రకటించింది. తెలంగాణాలో రికార్డు స్థాయిలో 73.2% ఓటింగు జరిగిందని ఈసీ తేల్చి చెప్పింది. ఇంత భారీగా జరిగిన ఓటింగు ఎవరికీ అనుకూలం అనేదాని పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. గత ఎన్నికల్లో నమోదైన 68.5 శాతం పోలింగ్‌ కన్నా 4.7 శాతం ఎక్కువ. ఇది ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఎవరూ చెప్పలేకున్నారు.

పోలింగ్‌ శాతం భారీగా పెరగడానికి రెండు కారణాలుంటాయి. ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత. ప్రభుత్వం పట్ల ఉండే తీవ్ర అసంతృప్తి ప్రజలను మూకుమ్మడిగా పోలింగ్‌ బూత్‌ల వరకు నడిపిస్తుంది. అంతటి వ్యతిరేకత ఉందా? అన్నది ప్రధాన ప్రశ్న. రెండో కారణం ప్రభుత్వం పట్ల సానుకూలత. దాదాపు 80 లక్షల మంది ప్రభుత్వ పథకాల నుంచి నేరుగా లబ్ధి పొందుతున్నారని తెరాస అంటోంది. అయితే సానుకూలత వల్ల భారీగా ఓటింగు పెరగడం అనేది చాలా అరుదుగానే జరుగుతుంది.

సహజంగా కోపాన్ని చూపించడానికి మనిషి ఆరాటపడతాడు కృతజ్ఞత చూపించడానికి మాత్రం అంత ఉత్సాహం ఉండదు. అలా అని అది జరగకూడదు అని కాదు. మరోవైపు గతంలో ఎప్పుడూ జరగనంత డబ్బు పంపకం ఈసారి తెలంగాణలో జరిగింది. అది కూడా ఓటర్లను పోలింగ్ బూత్ లకు రప్పించింది. యువత, ముఖ్యంగా నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారనే సమాచారం ఉంది. వీరు పది లక్షల మంది వరకు ఉంటారు. సరైన నియామకాలు లేక వారిలో కొంత అసంతృప్తి ఉంది.

భారీ పోలింగ్‌ ద్వారా తమకే ప్రయోజనమని ఇరు పక్షాలు భావిస్తున్నాయి. దళితులు, ముస్లింలు, మహిళలు ఎక్కువగా మొగ్గు చూపే పార్టీలకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు. అయితే దళితులు కాంగ్రెస్ వైపు ఉండగా ముస్లింలు, మహిళలు తెరాస వైపు ఉండవచ్చు అని కొందరి విశ్లేషణ. ఈ అనుమానాలు చాలవు అన్నట్టు పోలింగ్‌కు ముందు, తర్వాత వచ్చిన లగడపాటి సర్వే అభ్యర్థులను మరింత గందరగోళంలో పడేసింది. ఆయన సర్వేకు ఉన్న విశ్వసనీయత కారణంగా గెలుస్తామనుకున్న తెరాసకూడా ఇప్పుడు అయోమయంలో పడిపోయింది. మొత్తానికి 11న ఎవరికీ మోదమో ఎవరికీ ఖేదమో చూడాలి.