Trivikram-Srinivas Telangana Police హైదరాబాద్ లో వాహనాల తనిఖీలలో భాగంగా ఇటీవల కాలంలో సెలబ్రిటీల వాహనాలు నిలుపుదల చేయడం హాట్ టాపిక్ గా మారింది. చలానాలు చెల్లింపుల విషయంలో ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేసీఆర్ సర్కార్, నాలుగు చక్రాల వాహనాలకు ఉండే బ్లాక్ ఫిల్మ్ లను తొలగించే పనిలో ఉంది.

సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు బ్లాక్ ఫిల్మ్ వేసిన వాహనాలలో ప్రయాణిస్తుంటారు. ఒకప్పుడు స్పెషల్ డ్రైవ్ లు పెట్టి భారీగా వీటిని తొలగించగా, గత కొంతకాలంగా వీటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ మళ్ళీ ఆ స్పెషల్ డ్రైవ్ ల మాదిరి పెడుతూ, సెలబ్రిటీల వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ లను తొలగించే పనిలో నిమగ్నం అయ్యారు.

ఇటీవల కాలంలో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వాహనాలతో పాటు మరికొంతమంది సెలబ్రిటీల వాహనాలను ఆపి బ్లాక్ ఫిల్మ్ ను తొలగించిన పోలీసులకు నేడు ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ కారు కనిపించింది. త్రివిక్రమ్ కారు యొక్క బ్లాక్ ఫిల్మ్ ను తొలగించిన జూబ్లీ హిల్స్ పోలీసులు జరిమానా కూడా విధించారు.

అయితే ఈ బ్లాక్ ఫిల్మ్ ల తొలగింపు కేవలం సినీ సెలబ్రిటీలకు మాత్రమే వర్తిస్తుందా? రాజకీయ నాయకులకు వర్తించదా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. నిబంధనల ప్రకారం బ్లాక్ ఫిల్మ్ వేయడం నేరమే, చట్టం ముందు అందరూ సమానులే కదా, మరి ఇదే రీతిలో పొలిటికల్ లీడర్స్ వాహనాల యొక్క బ్లాక్ ఫిల్మ్ లు కూడా తొలగించాలి కదా! మచ్చుకైనా అలాంటి వార్త యాడ జాడ రాదే?!