Telangana police stopped AP ambulances at the checkpostsతెలంగాణ పోలీసులు తన చెక్ పోస్టుల వద్ద ఆంధ్రప్రదేశ్ కు చెందిన అంబులెన్సులను ఆపడం తీవ్ర వివాదాస్పదం అయ్యింది. గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఈరోజు ఉదయం తెలంగాణ పోలీసులు ఏకంగా 20 అంబులెన్సులను అడ్డుకున్నారు. దీంతో సకాలంలో వైద్యం అందక ఇద్దరు రోగులు మృతి చెందారని వార్తలు వచ్చాయి.

దీనిపై ఏపీ ప్రభుత్వం తరపున ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వాళ్ల ప్రజల గురించి ఆలోచించడం సహజమేనని.. అయితే మానవత్వంతో ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణలోకి అనుమతించాలని కోరారు. 2024 వరకు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అని గుర్తు చేస్తూ అవసరమైతే దీనిపై సుప్రీమ్ ను కూడా ఆశ్రయిస్తామని వారు చెప్పారు.

ఇదే విషయంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు మాట్లాడుతూ ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకుని దీనిని పరిష్కరించాలని లేని పక్షంలో పార్లమెంట్ లో తాను రాజధాని విషయంగా మాట్లాడతా అని చెప్పుకొచ్చారు. “మూడు రాజధానులు అంటూ ఏపీకి క్యాపిటల్ లేకుండా పోయింది. అయినప్పటికీ హైదరాబాద్ 2024 వరకు కామన్ క్యాపిటల్,” అని ఆయన అన్నారు.

“అవసరమైతే మా రాజధాని రగడ ముగిసేవరకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఇంకో ఐదేళ్ల పాటు కొనసాగించాలని పార్లమెంట్ లో డిమాండ్ చేస్తా. కానీ పక్షంలో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం చేసి రెండు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి తేవాలని కేంద్రాన్ని కోరుతా,” అని చెప్పుకొచ్చారు. అసలు ఇప్పటివరకు సోయలో లేని ఉమ్మడి రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతం వంటి అంశాలు కేవలం కేసీఆర్ వల్లే తిరిగి తెరమీదకు వచ్చాయని తెలంగాణ వాదులు ఫైర్ అవుతున్నారు.