Telangana Congress Partyతెలంగాణాలో పంచాయితీ ఎన్నికల సంబరం పూర్తయ్యింది. మూడు విడతలలో జరిగిన ఎన్నికలలో అన్నీ కలిపి మొత్తం 61 శాతం సర్పంచి స్థానాలు అధికార పార్టీ వారి వశమయ్యాయి.మొత్తం 12,626 పంచాయితీలకు గానూ తెరాస 7731 పంచాయితీలు గెలుచుకుంది. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల విజయం ఇచ్చిన జోష్ మరియు అధికార పార్టీకి సహజంగానే ఉండే అనుకూలత వల్ల ఆ పార్టీకి బాగా లాభం చేకూరింది. మరోవైపు కాంగ్రెస్‌ మద్దతుదారులు 22 శాతం సర్పంచి స్థానాల్లో గెలిచి ద్వితీయ స్థానంలో నిలిచారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెంటనే వచ్చిన ఈ ఎన్నికల మీద ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. పైగా శ్రేణులు, నాయకులు పూర్తి స్థాయిలో నిరాశ నిస్పృహలలో ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కు ఈ మాత్రం పంచాయతీలు వచ్చాయంటే గణనీయమైనవే కదా! మొదటి రెండు విడతల కంటే మూడో విడతలో కాంగ్రెస్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులూ సత్తా చాటారు. మొత్తం 14 శాతం సర్పంచి పదవులు వారికి దక్కాయి. అయితే ఫలితాల తరువాత చాలా మంది అధికార పార్టీ పంచన చేరడం ఖాయంగా కనిపిస్తుంది.

మరోవైపు బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు 3 శాతం స్థానాలకే పరిమితమయ్యాయి. తెలుగుదేశం పార్టీ అయితే 100 మార్కు కూడా దాటలేక పోయింది. బీజేపీకి ఏమాత్రం అనుకూలమైన ఫలితాలు రాకపోయినా తెలుగుదేశం పార్టీ కంటే రెట్టింపు స్థానాలు రావడంతో సరిపెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు చూపుడు వేలిపై వేసిన సిరా గుర్తు ఆరకముందే వచ్చిన ఈ ఎన్నికలలో డబ్బు ప్రవాహం అసెంబ్లీ ఎన్నికలలో కంటే ఎక్కువ ఉండటం గమనార్హం. అప్పటి ఎన్నికల కంటే రెండింతల డబ్బు పంపకం జరిగింది.