Telangana, Telangana New Districts, Telangana New Districts Status, Telangana New Districts Expense, Telangana New Districts Costఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 23 జిల్లాలను తెలంగాణా 10, ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలతో రెండుగా విడిపోయిన తరువాత ఇద్దరు ముఖ్యమంత్రులు వారి వారి మంత్రిత్వ శాఖలతో కలసి తమ తమ రాష్ట్రాలను అభివృద్ది చేసుకునే పనిలో పడ్డారు. అది హర్షించదగ్గ విషయమే! అయితే 23 జిల్లాలకు కలిపి ఒక్క ముఖ్యమంత్రి మరియు వారి ఆధ్వర్యంలో మంత్రి వర్గం ఉండేవారు. విభజన నేపధ్యంలో ఆ పదవులు కాస్త రెట్టింపైన విషయం తెలిసిందే. అంటే అంతకుముందు రాష్ట్ర అభివృద్ధికి వెచ్చించిన ప్రజాధనం రెట్టింపు శాతం, ప్రభుత్వ కార్యకలాపాల కోసం ప్రభుత్వాలు వినియోగిస్తున్నాయి. అయితే ఆ పర్యవసానాలతో రాష్ట్రాలు వేగంగా వృద్ధిని సాధిస్తాయి కాబట్టి విమర్శలకు తావు లేని అంశం.

కానీ, ఇప్పుడు తెలంగాణలో ఆ ఉన్న 10 జిల్లాలను ఏకంగా 30 జిల్లాలుగా మార్చడం వలన ఎంతటి ప్రజాధనాన్ని ప్రభుత్వ పెద్దలు వృధా చేస్తున్నారో ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలని విజ్ఞులు అభిప్రాయ పడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలకు కలిపి ఉండే మంత్రివర్గం ఇప్పుడు 10 జిల్లాలకే పరిమితం అయ్యింది. అంటే ప్రజా నిష్పత్తి తగ్గింది అధికారుల పని తీరు మరింత మెరుగు పడాల్సి ఉంది. కానీ, అలా కాకుండా అభివృద్ధి పేరుతో జిల్లాల సంఖ్యను ఇలా పెంచుకుంటూ పోతే, వృద్ధి కాదు… ప్రజా ధనం వృధా పెరుగుతుందన్నది గమనించాల్సిన అంశం.

పాలకులలో చిత్తశుద్ది ఉంటే జిల్లాల అభివృద్ధి దానంతట అదే జరుగుతుంది. దాని కోసం ఇలా జిల్లాల సంఖ్యను పెంచుకొంటూపోతే, అది ప్రజల సమస్యల పరిష్కారానికి కోసం కాదని, పార్టీలు ఫిరాయింపులు నాయకుల పదవుల పంపకాలకు పరిష్కారాన్ని చూపుతుందని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. ఇలా ఒక్క తెలంగాణా ప్రభుత్వమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనలో చేస్తోంది. ఎందుకంటే రెండు ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలో ఉండే నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించడంలో చాలా వరకు విజయాన్ని సాధించారు. ఇప్పుడు వారిని సంతృప్తి పరిచే కార్యక్రమంలో భాగమే ఈ జిల్లాల పెంపు ప్రక్రియగా విశ్లేషకులు భావిస్తున్నారు.

పక్క పార్టీ నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా పెరిగిన వారి పార్టీ నాయకులను సంతృప్తి పరచడానికి ఈ జిల్లాల పెంపు కార్యక్రమాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి త్వరితగతిన పూర్తి చేయడానికి శ్రీకారం చుట్టారని విశ్లేషకుల వాదన. మరికొంతమంది ప్రతిపక్ష నేతలు అధికార పార్టీలో చేరితే వారి కోసం కూడా మరికొన్ని కొత్త జిల్లాలు పుట్టుకోస్తాయేమో వేచిచూడాలి మరి. అయితే ఆ పెంపు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే సుమీ! అనుకోవాలంతే..!