Telangana MLA salariesమిగులు బడ్జెట్ గల రాష్ట్రంగా ఉన్న తెలంగాణాలో ప్రజాప్రతినిధులకు బంపర్ ఆఫర్ తగలనుంది. వారికి ప్రతి నెలా ఇచ్చే వేతనం మరియు మరిన్ని సదుపాయాలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం నెలకు 1.25 లక్షల వేతనం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ‘అసెంబ్లీ ఎమినిటీస్ కమిటీ’ సిఫారసు చేసిన మేరకు వేతనాల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇకపై వారు నెలకు 3.50 లక్షల వేతనం తీసుకుంటారు.

ఈ మేరకు అసెంబ్లీ మీటింగ్ హాలులో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అధ్యక్షతన భేటీ అయిన ఎమెనిటీస్ కమిటీ సభ్యులు ప్రతిపాదించిన మేరకు వేతనాల పెంపు, ఇతర సౌకర్యాల కోసం చేసిన డిమాండ్లను కమిటీ యథాతథంగా అనుమతించింది. సభ్యుల డిమాండ్లనే తీర్మానాలుగా మార్చేసిన కమిటీ అనుమతి కోసం ప్రభుత్వానికి పంపింది.

కమిటీ సిఫారసు చేసిన విషయాలకు వస్తే… సభ్యుల వేతనాలను 3.50 లక్షలకు మరియు వాహన రుణాలను ప్రస్తుతం ఉన్న 15 లక్షల నుంచి ఒకేసారి 40 లక్షలకు పెంచాలి. ఇక, వైద్య ఖర్చుల పరిమితిని ఎత్తేసి, అపరిమిత ఉచిత వైద్య సేవలను అందజేయాలి. ఎమ్మెల్యే పీఏ వేతనాన్ని 6 వేల నుంచి 25 వేలకు పెంచాలి. మాజీ సభ్యులకు ఇస్తున్న పెన్షన్ ను 50 వేల నుంచి 65 వేలకు పెంచాలి. మాజీ సభ్యులు మరణించినా, వారి భార్యలకు పూర్తి పెన్షన్ ను అందజేయాలి. ఈ సిఫారసులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే… వెనువెంటనే సభ్యుల వేతనాలు ఒక్కసారిగా అమాంతంగా పెరగనున్నాయి.