Congress- TTDP-TJS-CPIM- Mahakutami
తెలంగాణలో కాంగ్రెస్ తొలిజాబితా ఓ కొలిక్కి వచ్చినట్లు కనబడుతుంది. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురేసి పేర్లను సూచిస్తూ ఓ జాబితాను సిద్దం చేసింది. అయితే దాదాపు 25 నియోజకవర్గాల్లో ఒక్కోపేరు మాత్రం వచ్చింది. అందువల్ల ఈ పేర్లను వెంటనే ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.

దీనికి తోడు కొందరు సీనియర్లు పోటీ చేసే స్థానాలపై కూడా స్పష్టత రావడంతో 40స్థానాలను ప్రకటిస్తారని సమాచారం. అయితే తొలి జాబితా ప్రకటించే లోపలే మహాకూటమిలోని ఇతర పక్షాలకు సీట్ల పంపిణి పూర్తి చెయ్యాలి లేకపోతే వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. దీనితో మొదటి జాబితా మాత్రమే ప్రకటించాలా లేక ఒకే సారి అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలా అనేది ఆలోచన చేస్తున్నారు.

మరోవైపు తమకు 25-30 సీట్లు కన్నా తక్కువ ఇస్తే తమ దారి తాము చూసుకుంటామని కోదండరాం ఇప్పటికే బెదిరిస్తున్నారు. టీడీపీ తక్కువలో తక్కువ 20 సీట్లు ఆశిస్తుంది. దీనితో ఎటూ పోలేని స్థితిలో ఉంది కాంగ్రెస్. టీడీపీ కొంత మేరకు పట్టువిడుపులు ప్రదర్శిస్తున్నా కోదండరామ్ మాత్రం వెనక్కు తగ్గను అంటున్నారు.

మరోవైపు ఇప్పటికే 105 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేసి మిగిలిన సీట్లకు ప్రకటించడానికి సిద్ధమవుతున్న తెరాస మహాకూటమిలోని లుకలుకలు ఆనందంగా ఆస్వాదిస్తోంది. తమ రెబెల్స్ ను కొంత మేర శాంతిపచేసి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ రెబెల్స్ ను తమ పార్టీలోకి లాగడానికి వారి అభ్యర్థుల జాబితా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.