That-Is-Smart-KCR-for-Andhra-People!!తెలంగాణాలో ఎన్నికల తంతు ముగిసింది. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ కారు మరో సారి దూసుకుపోయింది. ఏకంగా 88 స్థానాలు కైవసం చేసుకుని అడ్డువచ్చిన ప్రతిపక్ష పార్టీలను తొక్కించేసింది. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు 19 సీట్లు మాత్రమే మిగిలాయి. ఆ పార్టీలోని హేమాహేమీలు సైతం మట్టి కరిశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కు మరో సమస్య ఎదురవుతుంది. ఇప్పుడు ఆ పార్టీ తరపున ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించే ధైర్యం చేసే వారు కూడా కనిపించడం లేదు.

డీకే అరుణ, రేవంత్ రెడ్డి వారు గతంలో తమ వాణి గట్టిగా వినిపించినా ఇప్పుడు ఓటమి వల్ల అసలు బయటకు రాగలరా అనే అనుమానం ఉంది. ఐదు ఏళ్ల పాటు పోరాడటం అనేది అంత సులువైన విషయం కాదు. అది కూడా కేసీఆర్ లాంటి బలవంతుడితో. ఎదిరించే వారిని ఊరికే వదిలేది లేదు అని కేసీఆర్ ఇప్పటికే చెప్పకనే చెప్పారు. తనను ఇబ్బంది పెట్టాలని చుసిన పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రినే బెదిరించారు కేసీఆర్. రేవంత్ వంటి వారు ధైర్యం చేస్తే అవసరాన్ని బట్టి కేసులు కూడా ప్రయోగించే అవకాశం ఉంది.

దీనిని ముందే గ్రహించినట్టున్నారు జగ్గారెడ్డి. ఇకపై తాను సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు, మంత్రులు ఎవరిపైనా రాజకీయ విమర్శలు చేయనంటూ సంచలన ప్రకటన చేశారు ఆయన. .తన నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్‌ను అవసరమైతే యాభైసార్లు కలుస్తానని, సంగారెడ్డి జిల్లాకు కొత్తగా ఎవరు మంత్రిగా వచ్చినా వారి సూచనల మేరకు నడుచుకుంటానని చెప్పారు. తెరాసలో చేరబోనని, కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. దీని బట్టే తెలంగాణాలో ప్రతిపక్షాల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మనకు స్పష్టం అవుతుంది.

అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఎమ్మెల్యే ఎవరూ కనపడటం లేదు. ఎవరో ఒకరిద్దరు సీనియర్లు తప్ప అంతా ఓడిపోయారు. పీకలలోతు నిరాశ నిస్పృహలతో మునిగిపోయిన పార్టీని ఏదో విధంగా ముందుకు నడిపించాలి ఆ పార్టీ నాయకత్వం. లేదంటే తెలంగాణాలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మొత్తం 17 స్థానాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదంతా చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సమయం కూడా లేకపోవడం ఇందులో కొసమెరుపు, కేవలం ఆరు నెలలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి.