TSRTC-Bus-Strike-KCR-Telangana-TRSతెలంగాణ రాజకీయాల పై ఉన్న అనుమానాలు ప్రస్తుతానికి పటాపంచలు అయిపోయాయి. తెలంగాణ ప్రజల భరోసా ఇప్పటికీ కేసీఆర్ పైనే ఉందని ప్రజలు తమ ఓటు ద్వారా సమాధానం చెప్పారు. కాంగ్రెస్ కంచుకోట, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో కారు జోరు టాప్ గేర్ లో ఉంది.

ఉప ఎన్నిక లెక్కింపులో 15వ రౌండ్‌ ముగిసేసరికి 29,967 ఓట్ల ఆధిక్యంలో తెరాస అభ్యర్థి దూసుకుపోతున్నారు. 35,000 మెజారిటీకి తక్కువ కాకుండా వస్తుందని అధికార పార్టీ వారు అంటున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తమ్ ఇక్కడ నుండి కేవలం 7500 పై చిలుకు ఓట్లతో గెలవడం గమనార్హం. గత కొన్ని నెలలుగా కేసీఆర్ తెలంగాణపై పట్టు కోల్పోతున్నారు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

క్లీన్ స్వీప్ చేస్తారన్న పార్లమెంట్ ఎన్నికలలో తెరాస కేవలం తొమ్మిది సీట్లతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ మూడు, బీజేపీ నాలుగు సాధించి సంచలనం సృష్టించాయి. కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఓడిపోవడంతో ఇక కేసీఆర్ పని అయిపోయింది అన్నారు అంతా. దానికి తోడు మొట్టమొదటి సారిగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లారు. కేసీఆర్ పై ధిక్కార స్వరం వినిపించడం ఇదే మొదటి సారి.

ఈ ఎన్నికల గెలుపుతో బీరాలు పోయిన ప్రతిపక్ష పార్టీల ఆశల మీద నీళ్లు పోసినట్టు అయ్యింది. తెలంగాణ లో భవిష్యత్తు మాదే అన్న బీజేపీ ధరావత్తు కోల్పోతుంది. కాంగ్రెస్ అస్తిత్వ పోరాటం చెయ్యాల్సిన పరిస్థితి. ఆర్టీసీ స్ట్రైక్ కూడా కొన్ని రోజులలోనే ముగిసిపోతుంది. మరొక సారి కేసీఆర్ తెలంగాణపై తనకు ఉన్న పట్టుని చూపించుకోగలిగారని చెప్పవచ్చు.