telangana-kcr-ktr-trs-intermediate-revaluationతెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ బోర్డు నిర్వాకంతో చెలరేగిన అలజడి మరింత తీవ్రరూపం దాల్చుతోంది. ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు నాంపల్లిలోని బోర్డు కార్యాలయం ముందు గత రెండు రోజుల నుండి పెద్దస్థాయిలో ఆందోళనలకు దిగారు. అయితే వీరి ఆక్రోశంలో న్యాయం ఉన్నా పోలీసులను పెట్టి బలవంతంగా అరెస్టులు చేయించడం విశేషం.

వీరికి సంఘీభావం తెలపడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ను కూడా అరెస్టు చేసారు పోలీసులు. ఈ విషయంపై ప్రభుత్వం మీద కూడా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకూ దీని మీద స్పందించింది లేదు. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవి కేవలం అపోహలు మాత్రమే అని, అనుమానం ఉన్న వాళ్ళు రెవెల్యూయేషన్ చేయించుకోవాలని తేలికగా చెప్పేశారు. అదే సమయంలో ఆయన ఇవేమి పట్టనట్టు పార్టీ ఫిరాయింపులతో బిజీగా ఉన్నారు.

మరోవైపు తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఫలితాల్లో జరిగిన పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువ ఉన్నాయని ఆయన మండిపడ్డారు. మరోవైపు ఈ విషయం తెలంగాణ హై కోర్టుకు చేరింది. ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి సోమవారం దాకా టైమ్ ఇచ్చింది.