Telangana Intelligence arrests YouTube Channel Tejo Bhanuతేజ భాను యూట్యూబ్ లో ఒక ప్రముఖ ఛానల్ డైరెక్టరు. యూట్యూబ్ వ్యూస్ ఎక్కువ ఉండే వీడియోలకు దండిగా డబ్బులు చెల్లిస్తుంది. దీనితో ఛానల్ ఓనర్లు కాసులకు కక్కుర్తి పడి వారికి ఇష్టం వచ్చిన పేర్లతో వీడియోలు పెట్టేస్తున్నారు. ఒక్కోసారి వీడియో పేరుకు లోపల విషయానికి సంబంధం ఉండదు. అలాంటి అత్యుత్సాహమే ఇప్పుడు తేజ భానును కటకటాల పాలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలపై తెలంగాణ ఇంటెలిజెన్స్‌ సర్వే ఫలితాలంటూ ప్రచారం చేసిన కేసులో ఆయన అరెస్టు అయ్యారు.

తేజోభానును జూబ్లీహిల్స్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గత నెల 2న ఇంటెలిజెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ హరిప్రసాద్‌ ఫిర్యాదు నేపథ్యంలో ఒక సర్వే వివరాలకు తెలంగాణ ఇంటెలిజెన్స్‌ సర్వేగా పేరు పెట్టి యూట్యూబ్‌లో ప్రసారం చేసి.. తెలంగాణ ఇంటెలిజెన్స్‌ పేరును అప్రతిష్ఠపాలు చేయడంపై టీఎఫ్‌సీపై జూబ్లీహిల్స్‌ ఠాణాలో పలు సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈనెల 7న సంస్థకు చెందిన స్క్రిప్ట్‌ రైటర్‌ ముప్పాళ్ల ప్రసన్నకుమార్‌ను అరెస్టు చేశారు.

అసలు తెలంగాణ ఇంటెలిజెన్స్‌ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఎటువంటి సర్వే చెయ్యలేదని వారు స్పష్టం చేశారు. హోరాహోరీగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారీ ఎత్తున పందాలకూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలలో వీటి మీద ఉత్సుకతను ఇటువంటి వారు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఎలా ఉంది అనేది తెలియాలంటే వచ్చే నెల 23 వరకు ఆగాల్సిందే. అంటే దాదాపుగా నెల రోజులు నిరీక్షణ తప్పదు.