జగన్ కు ఎలాంటి మినహాయింపు ఇవ్వొద్దు!ఒక ముఖ్యమంత్రిగా వారానికి అయిదు రోజుల విచారణకు హాజరు కావడం అసాధ్యమని, తెలంగాణ హైకోర్టులో ఏపీ సీఎం ఓ పిటిషన్ ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. గత వారంలో జగన్ తరపు న్యాయవాది, తమకు ఎందుకు మినహాయింపు కావాలో కోర్టుకు విన్నవించుకోగా, నేడు సీబీఐ తరపున వాదనలు వినిపించారు.

గత పదేళ్లుగా జగన్ పై ఉన్న కేసులు విచారణ జరుగుతున్నాయని, జగన్ హాజరు కాని పక్షంలో ఇది మరింత ఎక్కువ కాలం కొనసాగుతుందని, అలాగే వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకని జగన్ కు ఎలాంటి మినహాయింపు ఇవ్వరాదని కోర్టుకు సీబీఐ తన వాదనలను వినిపించింది.

ఈ వాదనలు పూర్తయిన పిదప తీర్పును రిజర్వులో ఉంచింది కోర్ట్. ఈ వారంలో ఈ పిటిషన్ పై తుది తీర్పు వెలువడే అవకాశం ఉందని న్యాయవాదులు చెప్తున్నారు. తెలంగాణ హైకోర్టు ఇవ్వబోయే తీర్పుపై వైసీపీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఏపీ రాజకీయాలలో పెను ప్రభావం చూపే తీర్పుగా రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయ పడుతున్నారు.