Viveka_Murder_Tealngana_High_Court_Arrest_Avinashకడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనను సీబీఐ అరెస్ట్ చేయడం వంటి తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని కోరుతూ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఈరోజు కొట్టివేసింది. న్యాయవాదిని వెంటబెట్టుకొని విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలనే అవినాష్ రెడ్డి అభ్యర్ధనను కూడా హైకోర్టు తిరస్కరించింది. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు సహకరించాలని ఆదేశించింది కూడా.

ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకొంటున్నట్లు సీబీఐ హైకోర్టుకు చెప్పేసింది. ఇప్పుడు హైకోర్టు తాజా తీర్పుతో ఆయనను అరెస్ట్ చేసేందుకు సీబీఐకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన్నట్లయింది. కనుక తదుపరి విచారణ తర్వాత ఆయన అరెస్ట్ తప్పదని భావించవచ్చు.

అయితే ఈలోగా ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. అయితే వివేకా హత్యకేసు విచారణ ఏపీలో సజావుగా, నిష్పక్షపాతంగా జరగడం లేదని సుప్రీంకోర్టు కూడా నమ్మినందునే ఈ కేసును హైదరాబాద్‌కు బదిలీ చేసింది. కనుక ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న అవినాష్ రెడ్డి ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళినా అక్కడా తిరస్కారం తప్పకపోవచ్చు.

వివేకా హత్య కేసు విచారణ ఏపీలో జరుగుతున్నంత కాలం అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు కనీసం నోటీస్ ఇచ్చి విచారణకు హాజరుకావాలని ఆదేశించలేకపోగా, తిరిగి వారిపైనే కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కానీ ఎప్పుడైతే ఈ కేసు హైదరాబాద్‌కు బదిలీ అయ్యిందో అప్పటి నుంచి వివేకా హత్య కేసు విచారణ చాలా వేగవంతం అయ్యింది.

ఇప్పటికే జనవరిలో ఓసారి, ఫిభ్రవరిలో ఓసారి, మళ్ళీ మార్చిలో మరోసారి అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. ఇప్పుడు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేసింది కనుక ఈసారి ప్రశ్నించిన తర్వాత సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఏపీలో నాలుగేళ్ళపాటు సాగదీసిన కేసును తెలంగాణకు మారేసరికి కేవలం మూడు నెలల్లో అవినాష్ రెడ్డి అరెస్ట్ వరకు వచ్చేసింది.