Telangana_High_Court_CBIవైఎస్ వివేకా హత్యకేసులో నేడు హైదరాబాద్‌లో సీబీఐ విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ కేసులో ఈరోజు సీబీఐ తనని అరెస్ట్ చేస్తుందని భావించిన ఆయన, ముందుగా హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు.

ఈ కేసులో తనని అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఈ సందర్భంగా ఆయన తరపు న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకొన్న హైకోర్టు సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది.

అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది తన వాదనలతో ఈ కేసు విచారణను చిన్న మలుపు కూడా తిప్పారని చెప్పవచ్చు. వైఎస్ వివేకానంద రెడ్డి రెండో పెళ్ళి చేసుకొన్నప్పటి నుంచే ఆయన కుటుంబంలో ఆస్తి గొడవలు మొదలయ్యాయని, ఆ కారణంగానే ఆయన హత్యకు గురై ఉండవచ్చునని తాము మొదటి నుంచి చెపుతున్నాప్పటికీ సీబీఐ ఆ కోణంలో దర్యాప్తు జరుపకుండా, అవినాష్ రెడ్డిని నేరస్థుడిగా నిరూపించేందుకే ప్రయత్నిస్తోందని వాదించారు.

అయినప్పటికీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు సహకరిస్తున్నారని హైకోర్టుకి తెలిపారు. కనుక ఈ కేసులో అన్యాయంగా ఇరికించబడిన తన క్లయింట్ అవినాష్ రెడ్డిపై ఈ కేసు విచారణ పూర్తయ్యేవరకు అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలని కోరారు. ఆయన వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.

ఈ కేసులో అవినాష్ రెడ్డిని విచారిస్తున్నప్పుడు ఆడియో, వీడియో రికార్డ్ చేస్తున్నామని, కావాలంటే వాటిని ఇప్పుడే హైకోర్టుకు సమర్పించడానికి సిద్దంగా ఉన్నామని సీబీఐ న్యాయవాది తెలియజేశారు. వాటన్నిటినీ సోమవారం సీల్డ్ కవరులో సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.

అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకోవాలనుకొంటున్నామని సీబీఐ న్యాయవాది చెప్పగా, రెండు రోజులు ఆగమని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత అవసరమైతే అవినాష్ రెడ్డిని మరోసారి సీబీఐ కోర్టుకు పిలిపించుకోవచ్చని హైకోర్టు సూచించింది. అంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమని స్పష్టమైంది కానీ మరో రెండు రోజులు ఆయనకు గడువు లభించిందన్న మాట!