తెలంగాణలో మునుగోడు ఉపఎన్నికలకి ముందు ముగ్గురు బిజెపి ప్రతినిధులు నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు వచ్చిన్నప్పుడు వారిని కేసీఆర్ వలపన్ని పట్టుకొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై కత్తులు దూస్తున్న కేసీఆర్, ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకొని ఉపఎన్నికలలో విజయం సాధించాలనుకొన్నారు.
అంతే… ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారులు కూడా స్వామిభక్తి ప్రదర్శిస్తూ ఆ కేసుకి సంబందించి ఆడియో, వీడియో సాక్ష్యాధారాలన్నిటినీ సిఎం కేసీఆర్ చేతిలో పెట్టేశారు. ఆయన వాటిని దశలు వారీగా ఉపఎన్నికలు జరిగేవరకు మీడియాకి లీకులు చేస్తూ తెలంగాణ ప్రజలు ఎన్నుకొన్న తన ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటువంటి కుట్రలు చేస్తూ కూల్చివేయాలని ప్రయత్నిస్తోందని బలంగా నొక్కి చెప్పారు. ఆడియో, వీడియో సాక్ష్యాధారాలు కూడా విడుదల చేయడంతో ఆయన వ్యూహం ఫలించి ప్రజలు ఉపఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని గెలిపించారు.
అయితే కేసీఆర్‌కి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి, వారు కోరిన్నట్లుగానే కేసు దర్యాప్తుని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కి చేతిలో నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతే కాదు… ఇంతవరకు సిట్‌కి చేసిన దర్యాప్తుని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు ఆయన ఒకటీ రెండూ కాదు… ఏకంగా 45 కారాణాలను ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు.
వాటిలో అతి ముఖ్యమైనది, “దర్యాప్తు సంస్థ చేతిలో ఉన్న ఆడియో, వీడియో సాక్షాధారాలన్నీ సిఎం కేసీఆర్ చేతికి ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు?వాటిని మీడియాకి ఎవరు విడుదల చేశారు?” అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వాటిని రహస్యంగా భద్రపరిచి కోర్టుకి మాత్రమే సమర్పించాల్సిన దర్యాప్తు సంస్థ, కేసీఆర్ చేతిలో వాటిని పెట్టడం ద్వారా రాజకీయ ఒత్తిళ్ళకు లొంగిన్నట్లు అర్దమవుతోంది కనుక ఈ కేసుని అది నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయలేదని భావిస్తూ ఈ కేసు తదుపరి దర్యాప్తుని సీబీఐకి అప్పగిస్తున్నట్లు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు. దీంతో దర్యాప్తు సంస్థకి, కేసీఆర్‌కి కూడా హైకోర్టు మొట్టికాయలు వేసిన్నట్లే అయ్యింది.
ఈ కేసును మంచి సమయానికి అందిరావడంతో కేసీఆర్ దీనిని రాజకీయ కోణంలో నుంచి ఎలా వాడుకోవాలని మాత్రమే ఆలోచించారు తప్ప చట్టప్రకారం వ్యవహరించాలనుకోలేదు. కనుక కేసీఆర్ స్వయంకృతం వలననే ఈ కేసు దర్యాప్తు ఆయన చేతిలో నుంచి కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోయింది. దీంతో బిజెపిని ఎదుర్కొనేందుకు చేతికి అందివచ్చిన ఈ అస్త్రాన్ని కేసీఆర్ చేజార్చుకొన్నట్లయింది.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఈ కేసుని అడ్డంగా పెట్టుకొని కేసీఆర్‌తో ఆడుకొనేందుకు ప్రయత్నించడం ఖాయం. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఈ కేసులో ఈడీ విచారిస్తుండటమే ఇందుకు ఉదాహరణగా కనిపిస్తోంది. కనుక ఈ కేసుని తనకి అనుకూలంగా మలుచుకోవడంలో కేసీఆర్ తొందరపాటు ప్రదర్శించి బలమైన ఈ అస్త్రాన్ని చేజార్చుకొన్నారని చెప్పక తప్పదు.