telangana-govt-lifts-covid-lockdown-completelyశనివారం మధ్యాహ్నం సమావేశమైన తెలంగాణ కేబినెట్ లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించి ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.

థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్న తరుణంలో ఈ నిర్ణయం మంచిదా కాదా అనే చర్చ జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఇంకో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తి స్థాయి సన్నద్ధతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది.

ప్రస్తుతం దేశంలో పద్దెమ్మిది ఏళ్ల పైబడిన వారికే కోవిడ్ టీకా వేస్తున్నారు. అంటే స్కూల్ పిల్లలకు టీకాలు వేసే అవకాశం లేదు. పైగా థర్డ్ వేవ్ లో పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వొచ్చని కూడా అంటున్నారు. సహజంగా ప్రభుత్వం విద్యాసంస్థలు తెరవడానికి అనుమతి ఇస్తే స్కూల్ యాజమాన్యాలు ఇక ఆన్ లైన్ తరగతులు కూడా నిర్వహించవు.

ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు స్కూళ్లకు పంపాల్సిందే. ఈ తరుణంలో ఈ నిర్ణయం చాలా రిస్క్ తో కూడుకున్నది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మిగిలినవి మొదలుపెట్టడానికి ప్రభుత్వం దగ్గర లక్ష కారణాలు ఉండవచ్చు. అయితే ఆన్ లైన్ క్లాసుల పేరిట విద్యాసంస్థలు నడుస్తూనే ఉన్నాయి ఇటువంటి తరుణంలో ఇది పూర్తిగా అనవసరమైన రిస్క్.