telangana govt gave permission for acharya extra showsతెలంగాణలో ఆచార్య సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ పడింది. ఈ నెల 29న రిలీజ్ అయినప్పటి నుంచి మే 5వరకు ఒక అదనపు షో వేసుకొనేందుకు, టికెట్ ధరలు పెంచుకొనేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అదనంగా రూ.30, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.50 చొప్పున పెంచుకొనేందుకు అనుమతిస్తూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ రవి గుప్త సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

కానీ ఆచార్య రిలీజ్ దగ్గర పడుతున్నా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తుండటం విశేషం. ఇదివరకు సినీ నియంత్రణ చట్టంతో తెలుగు సినీ పరిశ్రమను కట్టిపడేసినప్పుడు, మొదట చిరంజీవి, ఆ తరువాత ఆయన నేతృత్వంలో రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు తదితర హేమాహేమీలందరూ సిఎం జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికి వచ్చి చేతులు జోడించి వేడుకొన్నారు.

కానీ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ మాత్రం ఆ సమావేశానికి రాలేదు. ఆ తరువాత వారిరువురి సినిమాలు విడుదలైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. అయినా రెండూ సూపర్ హిట్ అయ్యాయి. అఖండ సినిమా బాలకృష్ణ కెరీర్‌లో మరో మైలురాయిగా కూడా మిగిలిపోయింది.

ఆనాడు చిరంజీవి సినీ పరిశ్రమలో కొందరిని వెంటపెట్టుకొని సిఎం జగన్మోహన్ రెడ్డి ముందు చేతులు జోడించి ప్రాధేయపడ్డారు కనుక బహుశః ఆయన నటించిన ఆచర్యకు నేడో రేపో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అదనపు షోలు వేసుకొని, టికెట్ ఛార్జీలు పెంచుకొనేందుకు అనుమతించవచ్చు. కానీ మన తెలుగు సినిమా సత్తా ఏమిటో యావత్ దేశానికి, ప్రపంచానికి కూడా చాటి చెపుతూ తెలుగువారికి గర్వకారణమైన మన నటీనటులను, దర్శకులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించకపోగా చేతులు జోడించి నిలబెట్టించింది. అయినా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ పడుతుందో లేదో తెలీని దయనీయ పరిస్థితి.

ఓ సినిమాను నిర్మించడం ఎంత కష్టమో, దానిని ఏపీలో రిలీజ్ చేసుకోవడం అంత కంటే కష్టంగా మారడం చూసి సినీ పరిశ్రమలోవారే కాదు…ప్రజలు కూడా ఆవేదన చెందుతున్నారు. కానీ ఎవరూ ఏమీ చేయలేని నిసహయస్థితి! ఈ కష్టం పగవాడికి కూడా రావొద్దు.