KCR_Tamilisai_Soundararajanతెగే దాక తాడు లాగకూదు కానీ తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఆ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ విషయంలో అదే చేసి భంగపడ్డారు. గత ఏడాదిన్నరగా ఆమె పట్ల అనుచితంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో, సొంత పార్టీలో, ప్రభుత్వంలో ఆయనకి తిరుగులేకపోవడమే ఆయన అహంభావాన్ని పెంచి పోషించిందని చెప్పవచ్చు. అందుకే గవర్నర్‌ని ఖాతరు చేయలేదు.

ఫిభ్రవరి 3వ తేదీన తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు మొదలవుతాయి. ఆనవాయితీ ప్రకారం ఉభయసభల సభ్యుని ఉద్దేశ్యించి గవర్నర్‌ ప్రసంగించాలి. కానీ సాంకేతిక కారణాలు చూపి ఆమెని ఆహ్వానించకుండానే బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలనుకొని భంగపడ్డారు.

ఆమెని ఆహ్వానించకపోయినా రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్‌కి ఆమె ఆమోదముద్ర తప్పనిసరి. లేకుంటే దానిని మంత్రివర్గం ఆమోదించలేదు. శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టలేకపోయినా, ప్రవేశపెట్టిన ఆమోదించిన దానికి మళ్ళీ గవర్నర్‌ ఆమోదముద్ర వేయకపోయినా ఆ బడ్జెట్‌ చెల్లదు కనుక ప్రభుత్వం రద్దు అయిపోతుంది. ఇవేమీ పట్టించుకోకుండా ముసాయిదా బడ్జెట్‌ని గవర్నర్‌ ఆమోదానికి పంపించింది.

ఇక్కడే గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సిఎం కేసీఆర్‌కి తన అధికారాన్ని, దాంతో పాటు ఆయన పరిధిని కూడా గుర్తు చేశారు. ఆమె దానికి ఆమోదముద్ర వేయకుండా పక్కన పెట్టేశారు. అప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ప్రమాదం పసిగట్టి ఆమెతో రాజీపడి బడ్జెట్‌ సమావేశాలకి ఆహ్వానించి ఉంటే బాగుండేది.

కానీ ముసాయిదా బడ్జెట్‌ని ఆమోదించవలసిందిగా గవర్నర్‌ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ఈరోజు ఉదయం లంచ్ మోషన్ పిటిషన్‌ వేసింది. దానిని విచారణ స్వీకరించినప్పుడే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓ ప్రశ్న అడిగింది. “రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గవర్నర్‌ నిర్ణయాలు, అధికారాలపై హైకోర్టు న్యాయసమీక్ష చేయవచ్చా?” అని ప్రశ్నిస్తూ మరోసారి ఆలోచించుకోమని సలహా ఇచ్చింది.

దీంతో ఈరోజు భోజన విరామం తర్వాత మళ్ళీ ఈ కేసుపై హైకోర్టు విచారణ చేపట్టినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాది దుష్యంత్ దవే, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించుకొంటున్నట్లు తెలియజేశారు. అంతే కాదు… బడ్జెట్‌ సమావేశాలకు గవర్నర్‌ని ఆహ్వానిస్తామని తెలియజేశారు.

ఇది సిఎం కేసీఆర్‌కి పరాభవం లేదా ఓటమి అనే చెప్పుకోవచ్చు. కానీ చివరి నిమిషంలో విజ్ఞత ప్రదర్శించి కేసును ఉపసంహరించుకొన్నారు. లేకుంటే ఏం జరిగేదో?