Telangana Governor - Tamilisai Soundararajan - KCRతెలంగాణలో కేసీఆర్ సర్కారుకు అనుకూలమైన నరసింహన్ ను గవర్నర్ గా తప్పించి తమిళిసై ని రప్పించినప్పుడే తెరాసను రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతాయని అధికారపార్టీ నేతలతో సహా అందరూ భావించారు. దానికి తగ్గట్టుగానే పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె వల్ల ప్రభుత్వం సవాళ్ళు ఎదురుకుంటున్న తరుణంలో గవర్నర్ కూడా రంగంలోకి దిగడం విశేషం.

‘అసలేం జరుగుతోంది’ అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి ఆరా తీశారు. ముఖ్యంగా 48,600 కార్మికులు విధుల్లో చేరకుండా సెల్ఫ్ – డిస్మిస్ చేసుకున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం పట్ల ఆమె తీవ్రంగా స్పందించినట్టు వార్తలు వస్తున్నాయి. కార్మిక చట్టాల్లో ‘సెల్ఫ్‌ డిస్మిస్‌’ అనే పదం ఉందా? అని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం.

ఆ పదం లేకుండా కొలువుల నుంచి 48 వేల మంది కార్మికులు తొలగిపోయినట్లు ఎలా చెబుతారని నిలదీసినట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన గవర్నర్‌… సుమారు 40 నిమిషాల పాటు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆ తరువాత అమిత్ షా ను కూడా కలిశారు. ఆ పర్యటన వెంటనే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం.

గవర్నర్ ద్వారా ఆర్టీసీ కార్మికులను బీజేపీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. భేటీ అనంతరం సునీల్‌ శర్మ ప్రగతి భవన్‌కు వెళ్లి గవర్నర్ ఫోన్ సంభాషణ గురించి ముఖ్యమంత్రికి వివరించినట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా ఆర్టీసీ కార్మికుల సమ్మె పద్నాలుగో రోజుకు చేరింది. రేపు తెలంగాణ బంద్ కు వారు పిలుపినిచ్చిన సంగతి తెలిసిందే.