Telangana_Governor_Tamilisai_Soundararajan_CS_ShantiKumari_YS_Sharmilaపొరుగు రాష్ట్రం తెలంగాణలో ముగ్గురు మేడమ్స్ మద్య పోరాటాలు నడుస్తున్నాయి. వారే… తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి, వైఎసార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.

తాను సిఫార్సు చేసిన పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిరాకరించడంతో సిఎం కేసీఆర్‌ అహం దెబ్బతింది. అప్పటి నుంచి గవర్నర్‌కి ప్రోటోకాల్ మర్యాదలు బంద్ చేసి, మంత్రుల చేత ఆమెపై విమర్శలు చేయిస్తున్నారు. వాటికి ఆమె కూడా ధీటుగానే బదులిస్తున్నారు. అది వేరే విషయం.

శాసనసభ ఆమోదించిన 10 బిల్లులకి ఆమె ఆమోదం తెలుపకుండా తొక్కి పెట్టి ఉంచారని, తద్వారా గవర్నర్‌ రాజ్యాంగబద్దంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఆమెకి వ్యతిరేకంగా ఓ పిటిషన్‌ వేసింది. ఆ బిల్లులని తక్షణం ఆమోదించవలసిందిగా ఆమెను ఆదేశించాలని సుప్రీంకోర్టుని కోరింది.

దీనిపై ఆమె కూడా ఘాటుగానే స్పందించారు. “డియర్ తెలంగాణ సిఎస్… ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ మీకు దగ్గరే కదా? మీరు సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కనీసం మర్యాదపూర్వకంగానైనా రాజ్‌భవన్‌కు వచ్చారా?మీరు ప్రోటోకాల్ పాటించరు. అధికారికంగా పర్యటించరు. స్నేహపూరిత అధికారిక పర్యటనలతో ఎటువంటి సమస్యలైన పరిష్కరించుకోవచ్చు,” అంటూ శాంతికుమారిని ఉద్దేశ్యించి ట్వీట్‌పై చేశారు.

మద్యలో వైఎస్ షర్మిల హడావుడి వేరే ఉంది. ఆమె పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడం, ఆ సందర్భంగా బిఆర్ఎస్ నేతలు తన పట్ల అనుచితంగా మాట్లాడారంటూ ఆమె గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేశారు.

పనిలోపనిగా కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితమీద కూడా రెండు సెటైర్లు వేశారు. “బతుకమ్మ ఆడే కవితమ్మ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ చేయడం ఏమిటో… తన తండ్రి ప్రభుత్వంలో మహిళలకు రిజర్వేషన్లు అమలుచేయనప్పుడు ఢిల్లీలో దీక్ష చేయడం దేనికో?ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఢిల్లీలో దీక్ష అంటూ డ్రామా చేయబోతున్నారు. అయితే ఆమె ఢిల్లీలో కాదు… హైదరాబాద్‌లో తన తండ్రి నివాసం ప్రగతి భవన్‌ ఎదుట దీక్ష చేస్తే నేను కూడా వచ్చి పాల్గొంటాను,” అంటూ బాణాలు వేశారు.