Telangana government ignores NTR Ghat maintenanceనేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు 24వ వర్ధంతి. ఎన్టీఆర్ వర్థంతి కావడంతో.. హైదరాబాద్‌లోని ఘాట్‌‌లో వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌, దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు పుష్పగుఛ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. కొద్దిసేపు ఘాట్‌లోనే కూర్చొన్నారు.

ఇటు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. తమ అభిమాన నటుడిని గుర్తు చేసుకుని నివాళులు అర్పిస్తున్నారు. ఇటు ఆయన వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇది ఇది ఇలా ఉండగా గత సంవత్సరంలాగానే ఈ ఏడు కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణను పట్టించుకోలేదు. అధికారులు నిర్లక్ష్యం వహించడంతో నిన్నటి వరకూ ఎన్టీఆర్ ఘాట్ శిథిలావస్థలో ఉంది. పెచ్చులూడిపోయి కళా విహీనంగా మారింది. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ కుమార్తె, చంద్రబాబు సతీమణి, నారా భువనేశ్వరి రంగంలోకి దిగారు.

యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బందిని ఆదేశించారు. దీంతో ట్రస్ట్ సొంత ఖర్చులతో ఎన్టీఆర్‌ ఘాట్‌కు మరమ్మతులు చేసి వర్థంతి వేడుకలకు ముస్తాబు చేశారు ట్రస్ట్ సిబ్బంది.దీనితో ఆ మహనీయుడికి అవమానం తప్పింది. నిరుడు కూడా ఇదే పరిస్థితి తలెత్తడంతో అప్పటికప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పువ్వులు తెప్పించి ఘాట్ ను ముస్తాబు చేయించారు.