KCR - YS Jaganరెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి రాయలసీమకు కరువు లేకుండా చేస్తాం అని పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. దాని కోసం కసరత్తు కూడా మొదలు పెట్టారు. జగన్ అయితే సహకరించాలని కేంద్రానికి లేఖ కూడా రాశారు. మొన్న తిరుపతి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాయలసీమకు గోదావరి నీళ్ళు ఇచ్చి రాయలసీమను రతనాల సీమగా మారుస్తా అని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ కేంద్రాన్ని ఫిర్యాదు చెయ్యడం గమనార్హం.

శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీరందించే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ ద్వారా ఎక్కువ నీటిని తరలిస్తూ, గణాంకాల్లో మాత్రం ఏపీ అఽధికారులు తక్కువగా చూపిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఇక్కడి నుంచి తరలించే నీటిని పరిశీలించడానికి సంయుక్త బృందాన్ని అనుమతించాలని కృష్ణా బోర్డు చైర్మన్‌కు నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ శుక్రవారం లేఖ రాశారు. ఈ నెల 10, 11, 12వ తేదీల్లో తరలించిన నీటి ని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు.

7.28 టీఎంసీలను తరలించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంటుండగా, టెలిమెట్రీ యంత్రాల రికార్డు ప్రకారం 9.24 టీఎంసీలుగా నమోదయిందన్నారు. తరలించే నీటిని పరిశీలించడం కోసం ఈ నెల 13న తెలంగాణ ఇంజనీర్లు ప్రయత్నించగా అనుమతించలేదని చెప్పారు. ఇలాగే కొనసాగితే వ్యవస్థల విశ్వసనీయత పోతుందని కృష్ణా బోర్డు చైర్మన్‌ దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ ఒక్క లేఖతో గతంలో చేసిన పెద్ద పెద్ద వ్యాఖ్యలపై అనుమానాలు కలిగే పరిస్థితి నెలకొంది.