Telangana First Ever Woman Minister Sabitha Indra Reddy
ఆగస్టు 6న తెలంగాణ మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశముంది. అత్యున్నత విశ్వస నీయవర్గాల సమాచారం ప్రకారం ఈ విస్తరణలో నలుగురు సీనియర్‌ నేతలకు చోటు లభించనుందని తెలిసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపుగా ఖరారైందని విశ్వసనీయ సమాచారం. మహేశ్వరం టిక్కెట్ మీద ఎన్నికైన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి స్థానం లభిస్తే.. ఆమె తెలంగాణ తొలి మహిళా మంత్రి కానున్నారు.

తెలంగాణ ఏర్పాటైన తర్వాత మంత్రివర్గంలో ఇప్పటిదాకా మహిళలకు ప్రాతినిధ్యం లభించలేదు. మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం లేదంటూ శాసనసభలో కాంగ్రెస్‌ విమర్శించగా.. ఈ సారి ఇద్దరు మహిళలకు మంత్రిపదవులు దక్కుతాయని సీఎం పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతానికి ఒక్కరికే అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణ తొలి మహిళా మంత్రిగా ఒక ఫిరాయింపుదారు కావడం శోచనీయం అనే చెప్పుకోవాలి.

2018 శాసనసభ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున విజయం సాధించిన సబిత తదనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మూడింట రెండొంతుల మంది తెరాసలో చేరడంతో సబిత అధికారికంగానే తెరాస శాసనసభ్యురాలని స్పీకర్ ప్రకటించారు. మంత్రివర్గంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి సహా 12 మంది మంత్రులున్నారు. ఇంకో ఆరుగురికి అవకాశం కలిపించవచ్చు. ఇప్పుడు నలుగురికి అవకాశం ఇప్పించి మునిసిపల్ ఎన్నికల తరువాత మరో ఇద్దరిని తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారట.