Telangana - Elections - 2018 results makes sleepless nights to kodela siva prasadఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా ఉన్న సత్తెనపల్లి ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్ రావు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. దానికి కారణం కూడా తెలంగాణ ఎన్నికల ఫలితాలు కావడం విశేషం. తెలుగు రాజకీయ చరిత్రను పరీక్షిస్తే ఒకసారి స్పీకర్ గా పని చేసిన నాయకులు తదుపరి ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఓడిపోతున్నారు. ఇటీవలే తెలంగాణ ఎన్నికలలో భూపాలపల్లి నుండి పోటీ చేసిన స్పీకర్ మధుసూదనాచారి కాంగ్రెస్ నాయకుడు గండ్ర వెంకటరమణ చేతిలో చిత్తుగా ఓడిపోయారు.

విశేషం ఏమిటంటే ఆయన సొంత నియోజకవర్గంలో మూడవ స్థానానికి పరిమితం అయ్యారు. అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేసిన గండ్ర సత్యనారాయణ రెండవ స్థానంలో మధుసూదనాచారి కంటే ముందు ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో స్పీకర్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా 2014 ఎన్నికలలో ఓడిపోయినా సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణాలో స్పీకర్ పదవిని భర్తీ చెయ్యడానికి కేసీఆర్ కు తలపోటుగా పరిణమిస్తుందట. ఈ సెంటిమెంట్ వల్ల ఆ పదవి తీసుకోవడానికి ఇష్ట పడటం లేదట.

అసలు 1991 నుండి పోటీ చేసిన స్పీకర్లంతా ఓడిపోవడం గమనార్హం. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో ఏమవుతుందో అని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు వర్రీ అవుతున్నారట. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు. “స్పీకర్లుగా పని చేసిన వారు తమ నియోజకవర్గాలపై సరిగ్గా దృష్టి పెట్టి ఉండరు. శాసనసభ పనులలో బిజీగా ఉండటం వల్ల కావొచ్చు మరేదైనా కారణం అయ్యుండొచ్చు. అయితే ఇది మూఢనమ్మకంగా పరిణమించడం దురదృష్టకరం,” అని వారు అంటున్నారు.

అయితే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మాత్రం దీనితో ఏకీభవించడం లేదు. “ఈ సంప్రదాయం ఎప్పటి నుండో ఉంది. దీనికి భయపడే మధుసూదనాచారి ఆయన నియోజకవర్గాలలో విరివిగా పర్యటించే వారు, నిత్యం క్యాడర్ తో టచ్ లో ఉండేవారు. అయినా ఆయనకు ఓటమి తప్పలేదు,” అని వారు అంటున్నారు. అయితే మేలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఈ అనుమానాలను అక్కడి స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పటాపంచలు చెయ్యగలుగుతారేమో చూడాలి.