telangana-election-commission--parthasarathy-ghmc-electionగ్రేటర్ హైదరాబాద్ ‌లో ఎన్నికల నగారా మోగింది. మంగళవారం నాడు ఎన్నికల కమిషనర్ పార్థసారధి జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు. రేపటి నుండి నుంచే జీహెచ్ఎంసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది, నవంబర్ 20న నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు. ఆ మరునాడు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.

నామినేషన్ల ఉపసంహరణకు 24వ తారీఖు వరకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది, డిసెంబర్ 3న అవసరమైతే రీపోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు అదే రోజున ఫలితాలు వెల్లడి చేస్తారు. కోవిడ్ కారణంగా ఈ-ఓటింగ్‌కు అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినా అటువంటిది ఏమి లేదని తేల్చి చెప్పింది కమిషన్.

ఈ సారి బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయి. ఈ సారి మేయర్ స్థానం‌ జనరల్ మహిళ కేటాయించడం జరిగింది. గ్రేటర్‌లో మొత్తం ఓటర్స్ 74లక్షల 4 వేల 286 మంది ఉన్నారు. అందులో పురుషులు 38లక్షల 56వేల 770 మంది, మహిళలు 35లక్షల 46వేల 847 మంది ఉన్నారు. ఇతరులు 669 మంది ఉన్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 9, 248 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.

కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నైజింగ్ యాప్ ద్వారా ఓటర్లను గుర్తిస్తారు. గ్రేటర్‌లో అతిపెద్ద డివిజన్ మైలార్ దేవులపల్లి. ఈ డివిజన్లో మొత్తం 79వేల 290 మంది ఓటర్లు ఉన్నారు. అతి చిన్న డివిజన్ రామచంద్రాపురం 27 వేల 948 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణలోని అధికార పార్టీపై ప్రజలలో అసంతృప్తి మొదలయ్యింది అనే అంచనాలు వస్తున్న నేపథ్యంలో జరిగే ఈ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.