Telangana Congress - ready for MLC electionsతెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రంజుగా మారే అవకాశం కనిపిస్తుంది. అధికార తెరాస పార్టీకి నలుగురు మాత్రమే గెలుచుకోగల శక్తి ఉండగా మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి ఐదుగురు అభ్యర్థులను నిలబెట్టింది. ఐదో అభ్యర్థిని గెలిపించుకోవాలంటే ఇంకా ఎనిమిది మంది ఎమ్మెల్యేల సపోర్టు కావాలి. అంటే కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. మరోవైపు కాంగ్రెస్ ఈ సీటు ను అంత తేలికగా వదిలేలా కనిపించడం లేదు. దీనితో పోటీకి సై అంటుంది.

తమకు 19 మంది ఎమ్మెల్యేలు, టిడిపికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నందున పోటీచేయవచ్చని ఆ పార్టీ అబిప్రాయపడింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు ప్రతిపాదన కోసం అవసరమైన 10 మంది ఎమ్మెల్యేల సంతకాలను కూడా కాంగ్రెస్‌ సేకరించినట్టు సమాచారం.ఇందులో 8 మంది కాంగ్రెస్‌ సభ్యులతో పాటు ఇద్దరు టీడీపీ సభ్యుల సంతకాలున్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కట్టుబడి ఉండి, టిడిపి ఇద్దరు ఎమ్మెల్యేలు నిలబడితే కాంగ్రెస్ అభ్యర్ది గెలిచే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం రిటైర్‌ అవుతున్న షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. శశిధర్ రెడ్డి అయితే అమరావతికి వెళ్లి చంద్రబాబును కూడా కలిసి వచ్చారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ తమ అభ్యర్థిని గెలిపించుకోలేక పోతే మండలి నుండి ఆ పార్టీ మాయం అయిపోతుంది. ఇప్పటికే 2015 నుండి టీడీపీకి మండలిలో స్థానం లేకుండా పోయింది. దీనితో అసలు మండలిలో ప్రతిపక్షమే లేకుండా అయిపోతుంది.