KCR - Telangana CMసెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గతంలో ప్రతిపక్షంలో ఉండగా కేసీఆర్ డిమాండ్ చేసే వారు. అయితే అధికారంలోకి వచ్చాకా మజిలిస్ కోసమా అన్నట్టు ఆ విషయమే పక్కన పెట్టేశారు కేసీఆర్. పైపెచ్చు తెలంగాణకు నిజాం పాలనలో జరిగిన మేలు ఎప్పుడూ జరగలేదంటూ అసెంబ్లీ సాక్షిగా పొగిడేశారు ఆయన.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే బిజెపి పోరాడుతుంది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కేంద్రం కూడా రంగంలోకి దిగింది. కేంద్ర మంత్రి కిషన్ సింగ్ ముఖ్యమంత్రికి ఒక లేఖ రాసి దానిని మీడియాకు విడుదల చేశారు.

“హైదరాబాద్‌లో తెలంగాణ విమోచన అమరవీరుల ఉద్యమ స్ఫూర్తి కేంద్రానికి భూమి కేటాయిస్తే, ఒక అద్భుతమైన, ప్రేరణాత్మకమైన ‘తెలంగాణ విమోచన పోరాట స్ఫూర్తి కేంద్రం’ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం సిద్ధం,” అని ఆ లేఖ సారాంశం. ఒకవేళ ఈ ప్రతిపాదనకు కేసీఆర్ ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ ప్రజల ముందు దోషిని చేసే ప్రయత్నం చేస్తుంది.

అయితే ఎప్పుడో జరిగిపోయిన నిజాం నియంతృత్వ పాలన ఇంకా ప్రజలకు గుర్తు ఉంటుందా? దాని ఆధారంగా చేస్తున్న రాజకీయాలు బీజేపీని రాష్ట్రంలో ఉపయోగపడతాయా అనేది చూడాలి. ప్రతి ఏడాది సెప్టెంబర్ లో ఈ విషయంగా కొన్ని రోజులు హడావిడి చెయ్యడం మాత్రం బీజేపీకి పరిపాటి.