KCR-BRSతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ్ళ విజయదశమి సందర్భంగా మధ్యాహ్నం 1.19 గంటలకు తన జాతీయపార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించబోతున్నారు. దీని కోసం నేడు ఆయన అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో పార్టీ సర్వసభ్యసమావేశం నిర్వహిస్తున్నారు. నేడు కేసీఆర్‌ జాతీయపార్టీని ప్రకటించబోతున్నారు కనుక హైదరాబాద్‌లో ప్రగతి భవన్‌కు వెళ్ళే రోడ్లన్నీ టిఆర్ఎస్‌ శ్రేణుల కోలాహలంతో నిండిపోయాయి.

ముఖ్యమైన విషయం ఏమిటంటే నగరమంతటా కేసీఆర్‌ బొమ్మలతో పెట్టిన బ్యానర్లలో ‘బిఆర్ఎస్‌’ పేరు కూడా పెట్టేశారు. అంటే కేసీఆర్‌ జాతీయ పార్టీ పేరు ‘భారత్‌ రాష్ట్ర సమితి’ అని ఖరారు చేసినట్లే. సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆయన కొత్తగా మరో రాజకీయ పార్టీని స్థాపించడంలేదు. టిఆర్ఎస్‌ పేరునే బిఆర్ఎస్‌గా మార్చుతున్నారు. టిఆర్ఎస్‌ గులాబీరంగు జెండాయే బిఆర్ఎస్‌కి కూడా ఉంటుంది. కానీ దానిలో కారు బొమ్మకి బదులు భారతదేశం చిత్రపఠం ఉండబోతోంది.

ఈరోజు మధ్యాహ్నం 1.19 గంటలకు సిఎం కేసీఆర్‌ బిఆర్ఎస్‌ రిజిస్ట్రేషన్ పత్రాలపై అధ్యక్షుడి హోదాలో సంతకం చేస్తారు. ఆ తర్వాత అధికారికంగా బిఆర్ఎస్‌ జెండా, అజెండాల గురించి ప్రకటిస్తారు. రేపు గురువారం పార్టీ ముఖ్యనేతలు ఆ పత్రాలను తీసుకొని ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఎన్నికల కమీషన్‌కు సమర్పిస్తారు. ఎన్నికల కమీషన్‌కు వాటిని పరిశీలించిన తర్వాత నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. నెలరోజులలోపు ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే దానికి ఆమోదముద్ర వేస్తుంది. ఆ తర్వాత అసలు కధ మొదలవుతుంది.

బిఆర్ఎస్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎవరుంటారు?టిఆర్ఎస్‌లో ఎవరెవరికి ఆ పార్టీలో ఏయే పదవులు లభిస్తాయి? ఇతర రాష్ట్రాలకు ఏవిదంగా పార్టీని వ్యాపింపజేస్తారు? ఆయా రాష్ట్రాలలో బిఆర్ఎస్‌ ఇన్‌చార్జీలుగా ఎవరుంటారు?ముఖ్యం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బిఆర్ఎస్‌ ఏవిదంగా ముందుకు సాగబోతోంది?వంటి ప్రశ్నలకు అతి త్వరలోనే సమాధానాలు లభిస్తాయి.