Telangana CM KCR - Amit Shah BJP Politicsప్రత్యేక తెలంగాణా సెంటిమెంట్ ను ఎలా వినియోగించుకోవాలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినట్లుగా మరొకరికి తెలియదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నాడు విభజన సెంటిమెంట్ ను రగిల్చి, ప్రత్యేక తెలంగాణా ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన కేసీఆర్, అదే సెంటిమెంట్ తో ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపైనే కూర్చున్నాడు. తెలంగాణాలో ఎదురులేని రాజకీయ శక్తిగా ఎదిగిన కేసీఆర్ డీ కొట్టడం ప్రస్తుతం ఏ పార్టీకైనా అసంభవమే అనిపించే విధంగా సాగుతోంది.

ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ నేతలను తన పార్టీలో చేర్చుకుని, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసిన కేసీఆర్, తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తెలంగాణాలో పాతుకుపోదామని అమిత్ షా ద్వారా కదుపుతున్న పావులను గమనించి, ఒక్కసారిగా మళ్ళీ కేంద్రంపై విరుచుకుపడుతూ తెలంగాణా సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేసారు. ఎంతలా ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడారు అంటే… తనను వ్యక్తిగతంగా ఏమైనా అంటే సహిస్తానేమో గానీ, తెలంగాణా గురించి తేడాగా మాట్లాడితే నా ప్రాణం పోయినా ఊరుకునేది లేదంటూ నేరుగా అమిత్ షాను టార్గెట్ చేసారు కేసీఆర్.

గ‌తంలో తెలంగాణాలో అమిత్ షా పర్యటించిన సందర్భంగా… కేంద్రం 95 వేల కోట్లు ఇచ్చినట్లు చెప్పారని, ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా వ్యాఖ్యలు చేసారని, అంటే ఈ సారి కూడా అమిత్ షా అద్భుత‌మైనటువంటి అబ‌ద్ధాలు మాట్లాడారని ఎద్దేవా చేశారు. దేశాన్ని ప‌రిపాలించే పార్టీకి అధ్య‌క్షుడైన అమిత్ షా ఇటువంటి వ్యాఖ్య‌లు చేయడం ఏంటని, ఏ పార్టీ అయినా తెలంగాణ‌లో బ‌లం పెంచుకోవ‌చ్చని, అయితే, అస‌త్య ప్ర‌చారం చేయకూడ‌ద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంచిచెడ్డ‌లు ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తారని, వాస్త‌వాలు ఏంటో జ‌నాల‌కి తెలుసని అన్నారు.

అమిత్ షా ఇక్క‌డ‌కు వ‌చ్చి తెలంగాణా ఏదో వారి భిక్ష మీద బ‌తుకుతున్న‌ట్లు మాట్లాడుతున్నారని, ప్ర‌తి ఏటా తెలంగాణ‌కు అద‌నంగా 20 వేల కోట్ల రూపాయ‌లు ఇస్తున్న‌ట్లు ప‌లు వ్యాఖ్య‌లు చేశారని చెప్పారు. ‘అమిత్ షాకి నేను చాలెంజ్ చేస్తున్నాను… అద‌నంగా 200 రూపాయ‌ల కోట్లయినా ఇచ్చారా? ఇస్తే చెప్పండి’ అని కేసీఆర్ అన్నారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడి వెళ్లిపోతే ఒక ముఖ్యమంత్రిగా నేనెలా ఊరుకుంటా? కేంద్రానికి ప‌న్నుల కింద‌ తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయ‌లు చెల్లించుకుంద‌ని తెలిపారు.

రాష్ట్రం ఏర్ప‌డ్డ‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం 63,790 కోట్లు మాత్ర‌మే ఇచ్చింద‌ని, కేంద్ర ప‌న్నుల్లో వాటాల కింద ఈ మూడు ఏళ్ల‌లో రాష్ట్రానికి 37,773 కోట్లు వ‌చ్చాయ‌ని, కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలకు 18,574 కోట్లు వ‌చ్చాయ‌ని, జాతీయ ర‌హదారుల కింద ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రానికి 2,055 కోట్లు మంజూరు అయ్యాయని, ఇవ్వి కేంద్రమే ఖ‌ర్చు పెడుతుంద‌ని అన్నారు. విభ‌జ‌న చ‌ట్టం కింద 1,016 కోట్లు మాత్రమే రెండు వాయిదాలుగా కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణాకు ఇచ్చింద‌ని, ఏపీకి మాత్రం ఇప్ప‌టికి మూడుసార్లు ఇచ్చింద‌ని, ఫైనాన్స్ క‌మిష‌న్ ఫండ్స్ 5,160 కోట్లు వ‌చ్చాయని, కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తెలంగాణ‌కు 1,200 కోట్ల పై చికులు సీఎస్‌టీ బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు.

అమిత్ షా చెప్పిన అసత్యాల ప‌ట్ల‌ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్షమాపణ చెప్పాలని, లేదంటే ఈ రోజు తాను చెప్పిన లెక్క‌లే తప్పని నిరూపించాలని స‌వాలు విసిరారు. తాను చెప్పిన లెక్క‌లు అస‌త్యాల‌ని నిరూపిస్తే ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తాన‌ని అన్నారు. అమెజాన్‌, గూగుల్ లాంటి ఎన్నో సంస్థ‌లు హైద‌రాబాద్‌ లో ఉన్నాయ‌ని, కొన్ని కోట్ల విదేశీ మారకాన్ని సంపాదించి కేంద్ర ప్ర‌భుత్వానికి ఇస్తున్నామ‌ని, కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వ‌మే కాదు ఏ ప్ర‌భుత్వం ఉన్నా తెలంగాణకు నిధులు ఇవ్వాల్సిందేన‌ని, ఆ ప్ర‌కార‌మే బీజేపీ ప్రభుత్వం ఇస్తుంద‌ని, అంతేగానీ అద‌నంగా ఏమీ ఇవ్వ‌లేద‌ని అన్నారు.

ఓ పక్కన కేంద్రంతో… ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీతో సఖ్యంగా ఉంటూనే… మరో పక్కన కేంద్ర జాతీయ నాయకులు చేస్తోన్న అర్ధరహిత ప్రసంగాలను తీవ్రంగా ఖండించడం ద్వారా రాష్ట్ర ప్రజల్లో కేసీఆర్ తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్నారు. అయితే వీటి పర్యవసానాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయి? అన్నది పక్కన పెడితే, ప్రస్తుతానికి ధనిక రాష్ట్రంగా తెలంగాణా ఉంది కాబట్టి, కేంద్రం ఆర్ధిక నిధులు అంతంత మాత్రంగా ఇచ్చినా చలామణి అవగలుగుతోంది. అదే అదునుగా కేసీఆర్ కూడా తెలంగాణా సెంటిమెంట్ ను అవసరం వచ్చినప్పుడల్లా రగిలిస్తూ… తనకు అనుకూలంగా మలచుకోవడంలో సక్సెస్ అవుతున్నారు.