Somesh_Kumar_IASఇంతకాలం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆ రాష్ట్రంలో చక్రం తిప్పుతూ ఓ వెలుగువేలిగిన సోమేష్ కుమార్‌, హైకోర్టు ఆదేశం మేరకు ఏపీకి తరలివచ్చారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి విమానంలో గన్నవరం చేరుకొని సచివాలయంలోని సాధారణ పరిపాలనశాఖ (జీఏడి)లో రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్ళి సిఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సిఎం జగన్‌ని కలిసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “నేను ఓ ప్రభుత్వాధికారిని. హైకోర్టు ఆదేశం మేరకు ఏపీలో విధులలో చేరేందుకు వచ్చాను. నాకు రాష్ట్రంలో ఎక్కడ, ఎటువంటి పోస్టింగ్ ఇచ్చినా పనిచేస్తాను,” అని చెప్పారు.

రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆయనని ఏపీకి కేటాయించగా ఆయన ట్రిబ్యూనల్‌ని ఆశ్రయించి తెలంగాణలో కొనసాగుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఆయన సమర్దతని గుర్తించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కీలకమైన బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఆయన కూడా తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తూ కేసీఆర్‌కి అత్యంత ఆత్మీయుడిగా మారారు. కనుక కేసీఆర్‌ ఆయనని వదులుకోవడానికి ఇష్టపడలేదు. కానీ హైకోర్టు ఆదేశం మేరకు ఆయనని విడిచిపెట్టక తప్పలేదు.

తెలంగాణలో అత్యున్నత పదవిలో ఉంటూ, ముఖ్యమంత్రి వద్ద ఇంత గౌరవమర్యాదలు లభిస్తున్నందున ఆయన కూడా ఏపీకి వచ్చేందుకు ఇష్టపడలేదు. పైగా ఇటీవలే ఏపీకి జవహార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కనుక సోమేష్ కుమార్‌కి ఆ పదవి లభించే అవకాశం లేదు కనుక అంతకంటే తక్కువ హోదాలో ఉన్న పదవిలోనే పనిచేయాల్సి ఉంటుంది.

ఆయన ఏపీలో పనిచేయడానికి ఇష్టపడకపోవడానికి ఇదో కారణం కాగా, ఏపీలో ఇంచుమించు అన్ని ప్రభుత్వ వ్యవస్థలపై వైసీపీ రాజకీయ ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నందున అధికారులు స్వేచ్ఛగా పనిచేయలేని వాతావరణం, తీవ్ర ఒత్తిళ్ళు నెలకొని ఉన్నాయి. కనుక అధికార పార్టీ నేతల కనుసన్నలలో వైసీపీకి అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. తెలంగాణలో ఇటువంటి వాతావరణం లేదు. పైగా అక్కడ రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా అన్ని శాఖలు పనిచేస్తుంటాయి. కనుక తెలంగాణలో స్వేచ్ఛగా పనిచేసిన సోమేష్ కుమార్‌ ఏపీలో భ్రష్టు పట్టిపోతున్న వ్యవస్థలలో పనిచేయడానికి ఇష్టపడటం లేదు.

ఆయన పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్‌తో ముగుస్తుంది. ఆలోగా ఏపీలో ఎన్నికలు మరింత దగ్గర పడుతాయి కనుక వ్యవస్థల మీద రాజకీయ ఒత్తిళ్ళు మరింత పెరుగుతాయి. కనుక సోమేష్ కుమార్‌ ఈ 12 నెలలు ఇటువంటి అవాంఛనీయమైన వాతావరణంలో పనిచేయడానికి ఇష్టపడకపోవడం సహజమే. కనుక ఆయన స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకొని మళ్ళీ తెలంగాణకి వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన పదవికి రాజీనామా చేసి తెలంగాణ తిరిగివస్తే కేసీఆర్‌ ఆయనని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం.మరో రెండు మూడు రోజులలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.