Telangana Cabinet expansionతెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి 50 రోజులు గడిచిపోయాయి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటిదాకా కేబినెట్ విస్తరణ ఊసే ఎత్తడం లేదు. కేవలం ఒక మంత్రితో ఆయన ప్రభుత్వాన్ని నడుతున్న సంగతి తెలిసిందే. ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలంటే కేబినెట్ మీటింగు పేరుతో కేసీఆర్, మహమూద్ అలీ కూర్చుని టీ తాగి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఈ నెల ఆరో తేదీ వరకు మంచి రోజులు కావని గట్టిగా నమ్ముతున్నారు. ఏడు నుంచి పదో తేదీ వరకు మంచి రోజులని, కనుక ఈ రోజులలో ఈ విస్తరణ ఉండవచ్చని చెబుతున్నారు.

తొలుత నలుగురు లేదా ఎనిమిది మందికి అవకాశం ఇవ్వవచ్చని, పార్లమెంటు ఎన్నికల తర్వాత మిగిలిన పది మంత్రి పదవులను భర్తీ చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఇప్పటిదాకా కేబినెట్ ఎందుకు జరగలేదు అనేది అడగడానికి అటు మీడియా గానీ ప్రతిపక్షం గానీ ఊసెత్తకపోవడం విశేషం. దీనితో కేసీఆర్ పై కేబినెట్ విస్తరణ చెయ్యాలని ఎటువంటి ఒత్తిడి లేదు. ముఖ్యమంత్రిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చూశాకా ఫెడరల్ ఫ్రంట్ టూర్లని, యాగం అని ఆయనకు తోచినట్టు కాలం గడుపుతున్నారు.

ఎప్పటిలానే హైదరాబాద్ లో కంటే ఎక్కువగా ఫార్మ్ హౌస్ లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. అయితే తెరాస వారు మాత్రం ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం ఏదో రాడికల్ స్టెప్ అన్నట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారంటే ఏదో చారిత్రాత్మక నిర్ణయమే ఇది అని అంటున్నారు. తిరుగులేని మెజారిటీతో తిరిగి గెలిచాకా కేసీఆర్ ని అడిగేవారు ఎవరు? పైగా కేసీఆర్ ఏది చేసినా అది చరిత్రాత్మకం అన్నా రివాల్యూషనరీ అన్నా మనమందరం వినాల్సిందే. విని ఊరుకోవలసిందే.