Telangana - Budget - 20202020-21 సంవత్సరానికి గాను అసెంబ్లీలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థికమంత్రిగా అసెంబ్లీలో తొలిసారి హరీష్‌రావు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ … లక్షా 82 వేల 914 కోట్ల రూపాయలతో రూపొందింది. ఈ బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ.11వేల కోట్లు కేటాయించినట్లు హరీశ్ రావు వెల్లడించారు.

అలాగే చిన్న నీటిపారుదల శాఖకు రూ.600కోట్లు, రైతు వేదిక నిర్మాణానికి రూ.300కోట్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు. అయితే అంతకంటే ఎక్కువగా అన్నిరకాల పెన్షన్ల కోసం రూ.11,758 కోట్లు కేటాయించడం విశేషం. అలాగే రైతులకు ఏడాదికి ఎకరాకు 12,000 ఇస్తున్న రైతు బంధు పథకానికి 14,000 కోట్లు ప్రతిపాదించారు.

ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా రైతు రుణమాఫీకి కూడా ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే వాటి విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది. 25,000 లోపు రుణాలు ఉన్న 5,83,916 రైతులకు ఒకే విడతలో రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. మిగిలిన వారికి ఎలా చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.

ఆడపిల్లల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలక కోసం రూ. 350 కోట్లు ఖర్చుచేయనున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. రైతు ఏకారణంతో మృతి చెందినా పది రోజుల్లోనే ఆ కుటుంబానికి రైతుబీమా కింద రూ.5లక్షల పరిహారం అందించే రైతు బీమా కోసం రూ.1,141 కోట్లు కేటాయింపు చేశారు. మొత్తం మీద ఆర్ధిక మాంద్యం సమయంలో కూడా సంక్షేమానికి పెద్దపీఠ వేసిన బడ్జెట్ ఇది.