Telangana BJPబీజేపీ మాటలకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ పార్టీ పరిస్థితికి ఏ మాత్రం పొంతన లేకుండా ఉంది. ఆ పార్టీ నాయకులు ఎప్పుడు మాట్లాడిన అధికారంలోకి రావడం ఖాయం మేమే కింగులు మేమే కింగ్ మేకర్లు అన్నట్టుగా మాట్లాడతారు. అయితే గట్టిగా నాలుగు సీట్లు తెచ్చుకోగల సత్తా మాత్రం ఉన్నట్టుగా కనిపించదు. వివిధ కారణాల వల్ల తెలంగాణాలో జరుగుతున్న ఎన్నికలలో ఆ పార్టీ సొంతగా పోటీ చేస్తుంది.

కొన్ని సీట్లకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. అన్ని పార్టీలలో విపరీతమైన పోటీ ఉంటుంటే బీజేపీలో మాత్రం సీట్ల పంపకం సాఫీగా సాగిపోతుంది. చాలా సీట్లలో ఆ పార్టీ తరపున పోటీ చెయ్యడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. గెలుపు సంగతి తరువాత కనీసం 119 స్థానాలలోనూ పోటీ పెట్టకపోతే దేశవ్యాప్తంగా పరువు పోతుందని భయపడుతున్నారు కమలనాధులు. దీని కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఏదైనా పార్టీ తన అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తే వెంటనే టీవీలు పెట్టి టిక్కెట్టు రానందుకు గొడవ చేస్తున్న వారి పేర్లు రాసుకుంటున్నారు.

వారికి ఫోన్లు చేసి మా పార్టీలోకి రండి మీకు కావలసిన సీటు ఇస్తాం అని ఆఫర్ చేస్తున్నారు. కోదాడ సీటు కాంగ్రెస్ కు వెళ్లడంతో అక్కడ సీటు ఆశించి భంగపడిన మల్లయ్య యాదవ్ ను బీజేపీ టిక్కెట్టు మీద పోటీ చెయ్యమని ఆహ్వానించారు. కోదండరాం పార్టీకు చెందిన రాజేందర్ రెడ్డికి మహబూబ్ నగర్ సీటు ఇస్తామని ఆఫర్ చేశారు. దేశాన్ని పాలిస్తూ ఒక్కో రాష్ట్రాన్ని జయిస్తూ వస్తున్న బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఎక్కడ గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఇది చాలదు అన్నట్టు కలిసి వచ్చిన స్నేహితులకు వెన్నుపోటు పొడిచి అవతలి పార్టీలతో చీకటి వ్యవహారాలు నడపడంతో బీజేపీ పై ప్రజలకు మరి కాస్త చికాకు. ఒకరకంగా ఇదంతా స్వయంకృతాపరాధమే అనుకోవాలి.