Telangana BJP President Bandi Sanjay questions kcrబీజేపీ నేతల మాటలు చేతలు చిత్రంగా ఉంటాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయనిధికి, కేటీఆర్‌కు అందించిన విరాళాలను ఎలా ఖర్చు పెట్టారో ప్రజలకు తెలియజేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. అలాగే కరోనా నియంత్రణకు కేంద్రం ఇచ్చిన నిధులను ఎలా ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

బండి సంజయ్ డిమాండ్ న్యాయబద్దంగా ఉందనే చెప్పుకోవాలి కానీ, ఇదే ప్రశ్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది కదా? మాములుగా ఉపయోగించే ప్రధానమంత్రి సహాయ నిధి కాకుండా కరోనా విరాళాల కోసం పీఎం కేర్స్ ఫండ్ ని స్థాపించారు మోడీ. అయితే ఈ విరాళాల విషయంలో కేంద్రం ఎందుకనో పూర్తి గోప్యత పాటిస్తుంది.

కనీసం ఈ ఫండ్ కాగ్ పరిధిలోకి రాదని కూడా చెప్పింది. ఈ విరాళాల వివరాలకోసం ఆర్టీఐ దరఖాస్తు చేసిన వివరాలు ఇవ్వడం లేదు. మరి ప్రజలు అందించిన విరాళాలను ఎలా ఖర్చు పెట్టారో ప్రజలకు తెలియజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ డిమాండ్ చేస్తే మంచిది కదా?

ఇది ఇలా ఉండగా.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకారం దేశంలో మొత్తం కేసులు… 1,45,380. మరోవైపు తెలంగాణలో కేసులు రెండు వేలకు చేరువలో ఉన్నాయి. నిన్న రాత్రి బులెటిన్ ప్రకారం… తెలంగాణలో 1,930 కేసులు ఉన్నాయి. లాక్ డౌన్ సడలించిన నాటి నుండీ కేసులు బాగా పెరుగుతున్నాయి.