Bandi Sanjay Kumar - BJP Telanganaదేశంలో ఒక్కో పార్టీది ఒక్కో సిద్దాంతం, ఒక్కో విధానంతో పని చేస్తుంటాయి. బిజెపి హిందూ అజెండాతో కాంగ్రెస్‌ లౌకికవాదం అజెండాతో పనిచేస్తుంటాయి. ప్రాంతీయ పార్టీలైన టిఆర్ఎస్‌ తెలంగాణవాదం, సెంటిమెంటుతో పనిచేస్తుంటే, ఏపీలో వైసీపీ సంక్షేమాన్ని తన విదానంగా చేసుకొని ముందుకు సాగుతోంది. కానీ నదులన్నీ చివరికి సముద్రంలో కలిసినట్లుగా పార్టీల అజెండాలు, విధానాలు వేరైనప్పటికీ అన్నిటి లక్ష్యం ఒక్కటే! అధికారం చేజిక్కించుకొని దానిలో శాస్వితంగా కొనసాగడమే!ఇదే ప్రధాన అజెండాగా అన్ని పార్టీలు పనిచేస్తుంటాయి.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికార టిఆర్ఎస్‌ పార్టీకి బిజెపి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏకు మేకైనట్లు మెల్లగా రాష్ట్రంలో బలం పెంచుకొంటూ వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించి అధికారం కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. దీంతో టిఆర్ఎస్‌ దాని అధినేత సిఎం కేసీఆర్‌ అప్రమత్తమయ్యారు. అయితే రాష్ట్ర బిజెపి నేతలలో తాను ఢీకొనగల పెద్ద నాయకులు లేనందున, కేంద్రం భుజంపై తుపాకి పెట్టి రాష్ట్రంలో బిజెపిని షూట్ చేసేందుకు ప్రయాతిస్తున్నారు.

కానీ రాష్ట్రంలో బిజెపి జోరు ఏమాత్రం తగ్గించలేకపోగా దానిని టార్గెట్ చేస్తుండటం వలన దాని స్థాయిని పెంచారు. ఇదివరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తప్ప బిజెపిని పెద్దగా పట్టించుకొనేవారు కాదు. కానీ ఎప్పుడైతే సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు నిత్యం బిజెపి, దాని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నామస్మరణ చేయడం ప్రారంభించారో అప్పటి నుంచి రాష్ట్రంలో బిజెపికి పాపులారిటీ మరింత పెరిగింది. టిఆర్ఎస్‌ పార్టీకి బిజెపియే ప్రత్యామ్నాయమని తెలంగాణ ప్రజలు కూడా భావిస్తున్నారు ఇప్పుడు.

దీంతో ఇంతకాలం తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష గురించి ఎక్కువగా మాట్లాడినా టిఆర్ఎస్‌ నేతలు, ఇప్పుడు బిజెపి మతతత్వ విధానం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. మోడీ ప్రభుత్వం, బిజెపి అభివృద్ధి గురించి ఆలోచించకుండా ప్రజల మద్య మతచిచ్చు రగిలించి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని పదేపదే ఆరోపిస్తున్నారు.

నిజమే! అధికారంలో ఉన్న పార్టీ మతం గురించి మాట్లాడటం కంటే దేశ, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం గురించి ఎక్కువ ఆలోచించి పనిచేస్తే అందరూ హర్షిస్తారు. దేశానికి కూడా చాలా మేలు జరుగుతుంది. అయితే, బిజెపి దేశాభివృద్ధి గురించి మాట్లాడనంత మాత్రాన కేంద్రప్రభుత్వం దేశాభివృద్ధి చేయడం లేదనలేము. దేశవ్యాప్తంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలవుతున్నాయంటే కేంద్రప్రభుత్వం ఆ దిశలో పనిచేస్తుందనే అర్ధం.

అయితే ముందే చెప్పుకొన్నట్లు తమ పార్టీ అధికారంలో కొనసాగేందుకు బిజెపి తనకు బాగా ఆచ్చి వచ్చిన మతతత్వ విధానాన్ని వ్యూహంగా అమలుచేస్తుంటుంది. ఉదాహరణకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో అదే వ్యూహం అమలుచేసి బిజెపి 44 సీట్లు గెలుచుకొంది. టిఆర్ఎస్‌ ఈ విధానాన్నే తప్పుపడుతోంది.

కానీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా టిఆర్ఎస్‌ ప్రజలలో ప్రాంతీయవాదం, తెలంగాణ సెంటిమెంట్ రగిలించి లాభపడాలని ప్రయత్నిస్తున్నప్పుడు, బిజెపి మతతత్వ విధానంతో ఎన్నికలలో గెలవాలని ప్రయత్నిస్తే ఎలా తప్పు పట్టగలదు?

నిజానికి బిజెపి ఇదేవిదంగా ఎన్నికలను ఎదుర్కొంటుందని టిఆర్ఎస్‌ గ్రహించింది కనుకనే తన వ్యూహం మార్చుకొని తమ పార్టీది ‘అభివృద్ధి విధానం’ అయితే బిజెపిది ‘మత చిచ్చు రగిలించడం విధానమని’ టిఆర్ఎస్‌ గట్టిగా వాదిస్తోంది.

ఈ వాదనతో తెలంగాణ ప్రజలు బిజెపివైపు వెళ్ళకుండా అడ్డుకొంటూ టిఆర్ఎస్‌ వైపే నిలుపుకోగలదా?అంటే ఈ ప్రశ్నకు ఎన్నికలలోనే సమాధానం లభిస్తుంది.