Telangana  BJP opens on Hung in Telanganaపోలింగ్ పూర్తయిన 28 గంటల తరువాత ఎన్నికల కమిషన్ తెలంగాణాలో రికార్డు స్థాయిలో 73.2% ఓటింగు జరిగిందని ఈసీ తేల్చి చెప్పింది. ఓటర్ తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. తెరాస, మహాకూటమి గెలుపుపై తమ అంచనాలు తాము వేసుకుంటుంటే బీజేపీ మాత్రం ఎలాగైనా తెరాస మెజారిటీకి కాస్త దూరంలో ఆగిపోయి హంగ్ రావాలని కోరుకుంటుంది. ఎన్నికల ముందు బీజేపీ, తెరాస ఒక అవగాహనతో ముందుకు వెళ్తున్నాయని అందరూ ఆరోపించారు.

కేసిఆర్ శాసనసభ రద్దు చేసిన వెంటనే కేంద్రం వెంటనే ఎన్నికలు వచ్చేలా తన వంతు సాయం తాను చేసింది. బయటకి తిట్టుకున్నట్టు ఇరువైపుల వారు నటించినా లోపల ఏం జరుగుతుందో కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలియంది కాదు. అయితే ఎన్నికలు అవ్వగానే బీజేపీ నేతలు ఓపెన్ అయిపోయారు. అవసరమైతే తెరాసకు మద్దతు ఇస్తామని ఆ పార్టీ నేతలంతా ప్రకటనలు గుప్పిస్తున్నారు. జీవీఎల్ నరసింహ రావు వంటి వారైతే టీవీ డెబిట్ లలో తెరాస నాయకుడిగా మారిపోయారంటే అతిశయోక్తి కాదు.

ఇప్పుడు తాజాగా తెలంగాణలో అవసరమైతే టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తామని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి చెప్పారు. అనంతపురం జిల్లా పెనుగొండలో ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తామని.. కానీ ప్రభుత్వంలో ఎంఐఎం ఉండకపోతేనే ఇవ్వగలమని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో చంద్రబాబునాయుడు చేతులు కలపడం అప్రజాస్వమికమని ఆమె అభిప్రాయపడ్డారు. ఎంఐఎం తెరాస స్నేహితుల మంటూ ఎన్నికలకు వెళ్ళారు. ఇప్పుడు అవసరం పడితే బీజేపీ కోసం తెరాస ఎంఐఎంకు చెయ్యి ఇస్తుందా?