Bandi_Sanjay_Arrestతెలంగాణ రాష్ట్రంలో టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అవి చల్లారక మునుపే మళ్ళీ సోమ, మంగళవారాలలో వరుసగా రెండు రోజులు పదో తరగతి ప్రశ్నాపత్రాలు బయటకు వచ్చేశాయి. దీంతో కేసీఆర్‌ ప్రభుత్వం, రాష్ట్ర బిజెపిల మద్య మరోసారి భీకరస్థాయిలో పోరు మొదలైంది.

టిఎస్‌పీఎస్సీ స్కామ్‌లో మంత్రి కేటీఆర్‌ పీఏ తిరుపతి హస్తం ఉందని, కనుక కేటీఆర్‌ దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని బిజెపి నేతలు డిమాండ్‌ చేస్తుంటే, బిజెపియే టిఎస్‌పీఎస్సీలో రాజశేఖర్ అనే తమ పార్టీ కార్యకర్త ద్వారా పేపర్లు లీక్ చేయించి తమ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి కేటీఆర్‌ ఆరోపిస్తున్నారు.

తనపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు మంత్రి కేటీఆర్‌, బండి సంజయ్‌, రేవంత్‌ రెడ్డిలపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తూ నోటీసులు పంపించారు కూడా. ఈ కేసు విచారణ సాగుతున్న కొద్దీ అనేకమంది నిందితులు బయటపడుతున్నారు.

ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే, పదో తరగతి తెలుగు, హిందీ ప్రశ్నాపత్రాలు పరీక్షాకేంద్రాల నుంచి లీక్ అవడం, మొన్న జరిగిన తెలుగు పరీక్షల జవాబు పత్రాలను పోస్టల్ సిబ్బంది తరలిస్తుండగా వారిలో 15 పత్రాలు మాయం అవడంతో మరోసారి ప్రతిపక్షాలు కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాయి.

అయితే నిన్న పరీక్ష జరుగుతుండగా బయటకు వచ్చిన హిందీ ప్రశ్నాపత్రం అందుకొన్నవారిలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా ఉన్నారు. దీంతో మంగళవారం అర్దరాత్రి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి భువనగిరి కోర్టుకు తరలించారు.

కేసీఆర్‌ ప్రభుత్వం తన వైఫల్యాలను, అసమర్దతను కప్పిపుచ్చుకోవడానికే బండి సంజయ్‌ని అరెస్ట్ చేసిందని రాష్ట్ర బిజెపి నేతలు ఆరోపిస్తుంటే, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు, పలువురు బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఢిల్లీలో బిజెపి పెద్దల డైరెక్షన్‌లో రాష్ట్రంలో బండి సంజయ్‌ తదితరులు ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బ తీసేందుకు బిజెపి నేతలు ప్రశ్నాపత్రాలు లీక్ చేసే స్థాయికి దిగజారిపోయారని, రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో వారు ఆటలు ఆడుకొంటున్నారని ఎదురు దాడి చేస్తున్నారు. పెద్దగా చదువుకోని రాష్ట్ర బిజెపి నేతలు రాష్ట్రంలో పిల్లలు, యువత కూడా చదువుకోకుండా తమలాగే మతోన్మాదంతో ఉండాలని కోరుకొంటున్నారని బిఆర్ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

టిఎస్‌పీఎస్సీ, పదో తరగతి పేపర్స్ లీక్ కాకుండా చూడాల్సిన బాధ్యత టిఎస్‌పీఎస్సీది, రాష్ట్ర ప్రభుత్వానిదే అని వేరే చెప్పక్కరలేదు. కనుక ఇది ప్రభుత్వ వైఫల్యం, అసమర్దతే అని బిజెపి నేతలు వాదిస్తున్నారు. కానీ తమ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకే రాష్ట్ర బిజెపి నేతలు ఇటువంటి నీచమైన కుట్రలు చేస్తున్నారని బిఆర్ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

బిజెపి నిజంగానే ఇంత నీచమైన కుట్రలు చేస్తోందా? లేక కేసీఆర్‌ ప్రభుత్వమే తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి బండి సంజయ్‌ని అరెస్ట్ చేసి రాజకీయాలు చేస్తోందా?అనే ప్రశ్నలకు సమాధానాలు లభించే అవకాశం లేదు. కానీ ఈ రెండు పార్టీల రాజకీయ ఆధిపత్యపోరులో మద్యలో నిరుద్యోగులు, విద్యార్థులు నలిగిపోతుండటం చాలా బాధాకరం.