Andhra-Pradesh-Telangana-Developmentఏపీ, తెలంగాణ మంత్రుల మద్య వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌పై జరిగిన యుద్ధం అప్పుడే చల్లబడిన్నట్లే ఉంది. అయితే తెలంగాణ మంత్రులు మళ్ళీ ఏదో సందర్భంలో ఏపీ దయనీయ పరిస్థితి గురించి మాట్లాడక మానరు. అప్పుడు ఏపీ మంత్రులు మళ్ళీ ఎదురుదాడి చేసి వాళ్ళ నోళ్ళు మూయించాలని ప్రయత్నించడం ఖాయమే. కానీ గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని చక్కబెట్టుకొని చేతలతో జవాబు చెప్పే ప్రయత్నం చేయరు. కనుక విరిగిన రధచక్రంతో చేస్తున్న ఈ యుద్ధంలో ఏపీ ప్రభుత్వం ఎన్నటికీ గెలవలేదు.

ఏపీ, తెలంగాణలు 2014, జూన్ 2న ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఈ తొమ్మిదేళ్ళలో హైదరాబాద్‌తో సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందింది. ప్రతీ జిల్లాకు సమీకృత కలెక్టరేట్ భవనాలు, మార్కెట్‌ భవనాలు, అత్యాధునిక సదుపాయాలతో పోలీస్ స్టేషన్లు, మార్కెట్‌ యార్డులు, వైద్య, నర్సింగ్ కళాశాలలు, హాస్పిటల్స్, ట్యాంక్‌బండ్‌లు, అందమైన పార్కులు, విశాలమైన రోడ్లు వగైరా అనేక నిర్మించుకొన్నారు.

ఈ 8 ఏళ్లలో ఒక్క హైదరాబాద్‌ నగరంలో 33 ఫ్లైఓవర్లు, అనేక అండర్ పాసులు, స్కైవేలు నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్‌లో కొత్తగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం (ప్రగతి భవన్‌), సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఐ‌టి హబ్, నగరం నలుదిక్కుల నాలుగు భారీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇమేజ్‌ని టవర్స్, అర్బన్ పార్కులు… ఇలా చెప్పుకొంటూపోతే ఆ జాబితాకు అంతే ఉండదు. ఇవాళ్ళే హైదరాబాద్‌ నడిబొడ్డున కొత్తగా నిర్మించుకొన్న సచివాలయానికి సమీపంలో 125 అడుగుల డా.అంబేడ్కర్‌ విగ్రహాన్ని తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలనుకొంది. కానీ అదెప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు.

ఒకప్పుడు బీడుబారిన భూములకు కాళేశ్వరం ప్రాజెక్టుతో నీరు పారించుకొని ఇప్పుడు మూడు పంటలు పండించుకొంటున్నారు. ఇక పరిశ్రమలు, పెట్టుబడులు, ఐ‌టి కంపెనీలు హైదరాబాద్‌కు క్యూకడుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ఏపీకి తరలిపోవాలని ఆలోచించిన తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డి బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నా ఏపీకి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఎందుకు? తెలుగు సినీ ఇండస్ట్రీ హైదరాబాద్‌లో సెటిల్ అయిపోగా, విశాఖలో ఉన్న ఒకటీ అరా స్టూడియోలకు కేటాయించిన భూములు కబ్జాలకు గురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకొంటూనే అత్యుత్తమమైన సంక్షేమ పధకాలను కూడా అమలుచేస్తోంది. ఆ జాబితా కూడా చాలా పెద్దదే ఉంది.

ఏపీ విషయానికి వస్తే సాక్షాత్ ప్రధాని నరేంద్రమోడీ భూమిపూజ చేసిన అమరావతిని రాజకీయ ద్వేషంతో వైసీపీ ప్రభుత్వం పాడుపెట్టేసింది. అలాగని నేటికీ మూడు రాజధానులూ ఏర్పాటు చేయలేకపోయింది. గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ పరుగులు తీయిస్తే, జగన్ ప్రభుత్వం రివర్స్ గేర్ వేసి బ్రేకులు వేసింది. అది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఆ శాఖ వ్యవహారాల గురించి ఎన్నడూ మాట్లాడని మంత్రి అంబటి రాంబాబు చెప్పి చేతులు దులుపుకొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయతో గొలుసుకట్టు చెరువులను పునరుద్దరించుకొని భూగర్భజలాలను పెంచుకోవడంతో పాటు ఆ చెరువులలో చేపలు, రొయ్యలు పెంచుతూ మత్స్యకారులకు కూడా ఉపాధి కల్పిస్తోంది. తెలంగాణలో మిషన్ భగీరధతో ఇంటింటికీ స్వచ్చమైన నీళ్ళు అందిస్తుంటే, అప్పుడే రాయలసీమలో నీటి ఎద్దడి మొదలవడంతో మహిళలు నీళ్ళ కోసం బిందెలు పట్టుకొని రోడ్లపై నీళ్ళ ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఒక్క డీఏ కూడా బాకీ పెట్టకుండా చెల్లించేస్తోందని కానీ ఏపీ ప్రభుత్వం నెలనెలా సకాలంలో జీతాలు కూడా ఇవ్వకుండా తమని ముప్పతిప్పలు పెడుతోందంటూ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. వాళ్ళు జీతాల కోసం రోడ్లెక్కి ఆందోళనలు చేస్తే ప్రభుత్వానికే అవమానం అని తెలిసి ఉన్నా, వారికి ఆలస్యమైన పర్వాలేదు కానీ ప్రతీనెల టంచనుగా బటన్ నొక్కి సంక్షేమ పధకాలకు, వాటి గురించి ప్రచారానికి వందల కోట్లు విడుదల చేసుకుపోతోంది జగన్ ప్రభుత్వం.

ఒక ఇంటిని పాడుబెట్టడం గురించి విని ఉంటాము కానీ ఈవిదంగా ఏకంగా ఒక రాష్ట్రాన్నే పాడుపెట్టడం గురించి బహుశః ఎవరూ ఎన్నడూ విని ఉండరు.