Telangana - Andhra Pradesh - Deficit Budgetఆంధ్రప్రదేశ్ విభజన పూర్తి అయిపోయి ఐదు సంవత్సరాలు పూర్తి కావొస్తుంది. కేంద్రప్రభుత్వం తాజా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్థూల ఆర్ధిక లోటు తగ్గుతూ ఉండగా తెలంగాణాలో పెరుగుతుంది. 2017-18లో లోటు 27600 కోట్లు ఉండగా 2018-19లో అది 24210 కోట్లుగా ఉంది అంటే ఒక సంవత్సరంలో 3390 కోట్ల లోటు తగ్గింది. అదే సమయంలో విభజన తరువాత మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి లోటు లో కూరుకుపోయింది.

2017-18లో తెలంగాణ లోటు 23490 కోట్లు ఉండగా 2018-19లో అది 29080 కోట్లుగా ఉంది అంటే ఒక సంవత్సరంలో 5590 కోట్ల లోటు పెరిగింది. 2017-18లో తెలంగాణ అప్పులు 1,53,220 కోట్లు ఉండగా 2018-19లో అది 1,82,330 కోట్లుగా ఉంది అంటే ఒక సంవత్సరంలో 29110 కోట్ల మేర అప్పులు తెచ్చుకుంది. ఇటీవలే అప్పులు చెయ్యడం తప్పు కాదని, తాము ఒక ప్రణాళిక పరంగానే అప్పులు చేస్తున్నామని శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం మన అందరికి తెలిసిందే.

మరోవైపు 2017-18లో ఆంధ్రప్రదేశ్ అప్పులు 2,27,820 కోట్లు ఉండగా 2018-19లో అది 2,52,020 కోట్లుగా ఉంది అంటే ఒక సంవత్సరంలో 24200 కోట్ల మేర అప్పులు తెచ్చుకుంది. విభజన సమయంలోనే భారీగా అప్పులు, లోటు బడ్జెట్ తో ఉన్న ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ఎక్కువ అప్పులు చెయ్యడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ గత సంవత్సరం వడ్డీలకే 15,080 కోట్లు ఖర్చు పెట్టింది. అదే సమయంలో తెలంగాణ వడ్డీలకు 11,690 కోట్లు ఖర్చు చెయ్యాల్సి వచ్చింది.