Telagana BJP President bandi sanjay kumar plans bus yatraతెలంగాణ లో రాజకీయ వాతావరణం వాడివేడిగా ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలలో వచ్చిన జోష్ తో బీజేపీ జోరు మీద ఉంది. మేజిక్ ఫిగర్ కి కొంచెం దూరంలో ఆగిపోయిన టీఆర్ఎస్ ఏం చెయ్యబోతుంది అనేది ఆసక్తిగా మారింది. బీజేపీ కార్పొరేటర్లకు ఎర వెయ్యడం టీఆర్ఎస్ కి ఉన్న ఒక ఆప్షన్. కేసీఆర్ గతంలో చేసిన పనుల బట్టి ఆ దిశగా అడుగులు వెయ్యడం వింతేమీ కాదు. దీనితో బీజేపీ కూడా జాగ్రత్త పడుతుంది.

“మా కార్పోరేటర్ల జోలికి వస్తే మంచిగా ఉండదు. మా వారిని ఆకట్టుకుంటే నీ సర్కారు కూడటం ఖాయం. ఇప్పటికే 20-30 మంది నీ ఎమ్మెల్యేలు మాతోని టచ్ లో ఉన్నారు. ఖబడ్దార్,” అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. ఎక్స్ ఆఫీసీయో ఓట్లు కూడా కలిపినా టీఆర్ఎస్ ఇంకా పదకొండు ఓట్ల దూరంలో ఉండిపోయింది. ఫిబ్రవరి 10 తరువాత కొత్త కౌన్సిల్ ఏర్పడుతుంది.

అప్పట్లోగా ఏ పార్టీ కూడా తన ఆధిక్యం నిరూపించుకొకపోతే స్పెషల్ ఆఫీసర్ పాలన లోకి బల్దియా వెళ్తుంది. ఆ తరువాత మళ్ళీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇటీవలే కాలంలో కేసీఆర్ బీజేపీ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారు. వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా మారడం, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీని అనుసంధానం చెయ్యడం వంటివి చేసి తాను బీజేపీకి అనుకూలమే అన్నట్టు సంకేతాలు పంపారు.

అటువంటి తరుణంలో బీజేపీ కార్పొరేటర్లను ఆకట్టుకునే సాహసం చేస్తారా అనేది చూడాలి. మరోవైపు… రాజ్ భవన్ లో గవర్నర్ ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు కలిశారు. గ్రేటర్ లో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ లను గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యేలా.. కొత్త కౌన్సిల్ ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు గవర్నర్ ని కోరారు. లేకపోతే అధికార పక్షం ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని వారు గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు.