Team India Women lost T20 World Cup 2020ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2020 విజేతగా నిలిచింది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. స్టార్‌ బ్యాటర్‌ అలీసా హీలీ (75; 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసానికి తోడు.. మరో ఓపెనర్‌ బెత్‌ మూనీ (61 నాటౌట్‌; 43 బంతుల్లో 9ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో భారీ స్కోర్ దక్కింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. ప్రధాన బ్యాటర్లు షషాలీ (2), మంధాన(11), రోడ్రిగ్స్‌(0), హర్మన్‌(4) ఘోరంగా నిరుత్సాహపరిచారు. చివర్లో దీప్తి శర్మ(33) రాణించడంతో కనీసం 99 వరకూనైనా చేరింది. ఇది ఇలా ఉండగా… కప్ కి అంత దగ్గరగా వెళ్ళి గెలవకపోవడం క్రికెట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

వారి బాధకు కూడా ఒక కారణం ఉంది. 2014 తరువాత నుండి పురుషులు అయితేనేమీ స్త్రీలు అయితేనేమి ఇప్పటివరకూ ఒక్క ఐసీసీ టోర్నమెంట్ కూడా గెలవలేకపోయారు. గెలవలేకపోయారు అనేకంటే గెలుపు ముంగిట చతికిల పడ్డారు అని చెప్పుకోవాలి. 2014 తరువాత అటువంటి అవకాశాలను ఎనిమిది సార్లు పోగొట్టుకున్నారు.

2014 నుండి నాలుగు సార్లు సెమి ఫైనల్స్ లోనూ, నాలుగు సార్లు ఫైనల్స్ లోనూ టీం ఇండియా ఓటమి చెంది వట్టి చేతులతో వెనక్కు తిరిగి వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా లో జరగబోయే పురుషుల టీ20 వరల్డ్ కప్ లోనైనా ఈ పరిస్థితి మారుతుందేమో చూడాలి.