Team India Vs Bangladesh T20ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ పై ఒక పరుగు తేడాతో టీమిండియా విజయం సాధించడం వెనుక మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ ఉందన్న విషయం వీక్షకులకు తెలిసిందే. అయితే 19 ఓవర్లు ముగిసిన తర్వాత చివరి ఓవర్ వేయడానికి భారత జట్టులో ఉన్న ఏకైక బౌలర్ హార్దిక్ పాండ్య. ఈ బౌలర్ పై ఇటు క్రికెట్ అభిమానులకు గానీ, అటు జట్టు సభ్యులకు కూడా అంతగా నమ్మకం ఉండి ఉండకపోవచ్చు.

కానీ, బంతిని పాండ్య చేతికి ఇచ్చిన ధోని ఎప్పుడూ లేని విధంగా కాసేపు బౌలర్ కు ఉపన్యాసం ఇచ్చాడు. అలాగే బాల్ బాల్ కు మధ్యలో కూడా పాండ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. సహజంగా ధోని ఇలాంటి వాటికి పూర్తి విరుద్ధం. అయితే ఇంతకీ పాండ్యతో ధోని ఏం మాట్లాడాడు? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని ఈ విషయమై ప్రస్తావిస్తూ… చేయాల్సిన పరుగులు చాలా తక్కువగా ఉన్నాయి గనుక ముఖ్యంగా వైడ్ బాల్స్ ను వేయవద్దని పాండ్యకు చెప్పానని, చివరి బంతికి మాత్రం టైల్ ఎండర్ బ్యాట్స్ మెన్ గనుక బాల్ కీపర్ చేతికి వచ్చేలా బంతిని వేయాలని సూచించానని, అదే విధంగా పాండ్య బౌల్ చేసాడని, అదృష్టం కూడా కలిసి రావడంతో విజయం తమ వైపుకు చేరిందని ధోని అభిప్రాయ పడ్డారు.

ఈ మ్యాచ్ లో రేపిన ఉత్కంఠ ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని సైతం కదిలించింది. అలాగే బిగ్ బీ అమితాబ్… ఒకరేమిటి సెలబ్రిటీలు, సామాన్యులతో సోషల్ మీడియాలో మోత మోగింది. విజయం సాధించిన ఆనందంలో మునిగి తేలడం భారతీయుల వంతయితే, తమ జట్టు ఖచ్చితంగా గెలుస్తుందని అప్పటివరకు కేరింతలు కొట్టిన బంగ్లా అభిమానులు ఊసురూమంటూ దర్శనమిచ్చారు.