Team India icc test ranking  world no.1ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యుత్తమైన జట్టు టీమిండియా. నెంబర్ 1 అంటే ఏ రేంజ్ లో ఆటను ప్రదర్శించాల్సి ఉంటుంది? ప్రత్యర్ధి ఎవరైనా ఆధిపత్యం తమదే అనిపించేలా ఉండాలి. ఆటలో ఎవరైనా గెలవొచ్చు అనుకుంటే… కనీసం పోరాట పటిమను అయినా ప్రదర్శించాలి. మరి ఆ స్థాయిలో టీమిండియా ఆడుతోందా? అంటే నోరెళ్ళబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండియన్ పిచ్ లపైన మరియు శ్రీలంక పిచ్ ల పైన అద్భుతాలు సృష్టించి, దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియాకు చుక్కలు కనపడుతున్నాయి.

బౌన్సీ పిచ్ లపై సఫారీ బౌలర్స్ ను ఎదుర్కోవడం టీమిండియా బ్యాట్స్ మెన్లకు వర్ణనాతీతంగా మారింది. ముందుగా ఎవరు ఔటై పెవిలియన్ కు చేరుకుంటే, ఓటమికి వాళ్ళు బాధ్యులు కాకుండా ఉంటారనే కోణంలో ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరుకోవడం టీమిండియా బ్యాట్స్ మెన్ల వంతవుతోంది. గెలుపోటములు ఏ జట్టుకైనా సహజం. కానీ అత్యుత్తమ జట్టు అని చెప్పుకోవాలంటే… విజయం సాధించకపోయినా కనీసం గెలుపు కోసం ప్రయత్నించాలి. కానీ ప్రస్తుతం టీమిండియా మాత్రం చేతులేత్తేస్తూ అభిమానులను నిరాశ పరుస్తోంది.

తొలి టెస్ట్ లో 208 పరుగుల విజయం కోసం బరిలోకి దిగి కేవలం 135 పరుగులకే కుప్పకూలిన టీమిండియా, రెండవ టెస్ట్ లోనూ అదే బాటలో పయనించడం జీర్ణించుకోలేని అంశంగా మారింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తరపున క్రీజులో ఒక్క ప్రధాన బ్యాట్స్ మెన్ కూడా కుదురుగా నిల్చోకపోవడం టీమిండియా నెంబర్ 1 స్థానాన్ని ప్రశ్నించేలా చేస్తోంది. ఒక్క బ్యాట్స్ మెన్ కూడా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయకపోవడమే టీమిండియా ప్రధాన లోపంగా కనపడుతోంది. మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో హార్దిక్ పాండ్య, రెండవ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లి మినహా టీమిండియా బ్యాటింగ్ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు.