Team India continues victory under Virat Kohli's captaincyకెప్టెన్ గా విరాట్ కోహ్లి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అద్భుతంగా రాణిస్తూ వరుసగా సిరీస్ లను కైవసం చేసుకుంటున్న టీమిండియా ఖాతాలో మరో విజయం చేరింది. శ్రీలంక సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసినపుడు కూడా లభించని కిక్, ఆస్ట్రేలియాతో కోల్ కతా వేదికగా జరిగిన రెండో వన్డే ద్వారా వీక్షకులకు లభించింది. వరుణుడు వలన అసలు మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనుకున్న తరుణంలో… షెడ్యూల్ సమయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యాచ్ మొదలు కాగా, మధ్యలో చిన్న చిన్న ఇంటర్వెల్స్ ఇచ్చినప్పటికీ, మ్యాచ్ లో ఫలితం అయితే వచ్చింది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 252 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. రెహనే – విరాట్ కోహ్లిల జోడి క్రీజులో ఉన్నంతసేపు 300 పరుగుల మార్క్ ను అవలీలగా అందుకుంటుందని భావించిన టీమిండియా, రెహానే (55) ఔటైన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఈ క్రమంలో మరో సెంచరీ సాధిస్తాడని భావించిన కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా 92 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ వెంటనే ధోని కూడా అవుట్ కావడంతో 250 పరుగులు సాధించడం కూడా కష్టసాధ్యంగా మారింది. అయితే చివర్లో పాండ్య, భువనేశ్వర్ కుమార్లు బాధ్యతాయుతంగా ఆడి, చెరో 20 పరుగులు చేయడంతో గౌరవప్రదమైన స్కోర్ ను మాత్రమే నమోదు చేయగలిగింది టీమిండియా.

ఆస్ట్రేలియా వంటి భారీ బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టుకు ఈ స్కోర్ చాలా తక్కువని భావించిన అభిప్రాయం తప్పని ఇండియన్ బౌలర్స్ నిరూపించారు.ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ ఆదిలోనే కార్ట్ వ్రైట్, వార్నర్ వికెట్లను తీయడంతో డిఫెన్స్ లో పడిన ఆస్ట్రేలియాను కెప్టెన్ స్మిత్ (59), హెడ్ (39)లు ఆదుకున్నారు. లక్ష్యం దిశగా సాగుతున్న ఈ భాగస్వామ్యాన్ని చాహల్ బ్రేక్ చేయడంతో, మ్యాచ్ టీమిండియా వైపుకు తిరిగింది. దీనికి తోడు మరో స్పిన్నర్ కులదీప్ యాదవ్ “హ్యాట్రిక్”ను నమోదు చేయడంతో మ్యాచ్ ఇక టీమిండియా వశం అయ్యింది. 148 పరుగుల ఆసీస్ స్కోర్ బోర్డు వద్ద వాడే, అగార్, కమ్మిన్స్ వికెట్లను తీసి కులదీప్ కెరీర్ లో తొలి హ్యాట్రిక్ ను నమోదు చేసుకున్నాడు.

ఆ తదుపరి వికెట్లను పాండ్య, భువనేశ్వర్ కుమార్ లు నేలకూల్చడంతో కేవలం 202 పరుగులకే ఆసీస్ ఆలౌట్ అయ్యింది. ఇంకా చేతిలో 6.5 ఓవర్లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసి, టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు టీమిండియా బౌలర్లు. కోల్ కతా వేదికగా అంతకుముందు కపిల్ దేవ్ ఓ హ్యాట్రిక్ ను నమోదు చేయగా, ఓ టెస్ట్ మ్యాచ్ లో హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియాపైన హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్నాడు. మళ్ళీ అదే కోల్ కతాలో కులదీప్ యాదవ్ ఆసీస్ పై హ్యాట్రిక్ ను అందుకోవడం విశేషం. వన్డేలలో టీమిండియా తరపున హ్యాట్రిక్ అందుకున్న (చేతన్ శర్మ, కపిల్ దేవ్) మూడవ బౌలర్ గా కులదీప్ యాదవ్ చరిత్ర సృష్టించాడు.