team india blue wash against australia 2017ఇటీవలే లంక వేదికగా జరిగిన వన్డే సిరీస్ ను ‘వైట్ వాష్’ చేసిన టీమిండియా జట్టు, అదే ఊపులో సొంతగడ్డపై ఆసీస్ ను కూడా ‘బ్లూ వాష్’ చేసేందుకు సిద్ధమవుతోంది. అవును… మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నోట ‘బ్లూవాష్’ అన్న పదం రావడంతో… ‘మెన్ ఇన్ బ్లూ’ మంచి ఉత్సాహం వచ్చింది. తొలి రెండు వన్డేలలో విజయం సాధించిన టీమిండియా, ఆదివారం నాడు జరిగిన మూడవ వన్డేలోనూ 294 పరుగుల లక్ష్యాన్ని 47.5 ఓవర్లలో అవలీలగా చేధించి, మరో రెండు వన్డేలు మిగిలి ఉండగానే సిరీస్ ను 3-0తో సొంతం చేసుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 293 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను నమోదు చేసింది. ఓపెనర్ ఫించ్ 125 బంతుల్లో 124 పరుగులు చేసి భారీ స్కోర్ కు బాటలు వేసాడు. కెప్టెన్ స్మిత్ 63 పరుగులతో అండగా నిలిచాడు. అయితే వీరిద్దరిని వెనక్కి పంపిన కులదీప్ యాదవ్, ఆసీస్ భారీ స్కోర్ ఆశలను నిర్వీర్యం చేసాడు. ఇక లక్ష్య చేదనలో ఎలాంటి తడబాటుకు గురి కాకుండా ఓపెనర్లు రోహిత్ శర్మ (71), రెహానే (70) పరుగులతో మంచి శుభారంభాన్ని అందించారు.

వీరిద్దరూ ఔటైన తర్వాత కోహ్లి (28) పరుగులు చేయగా, జాదవ్ (2) పరుగులకే వెనుదిరిగాడు. ఈ తరుణంలో ఒత్తిడిలో ఉన్న టీమిండియాకు మరోసారి హార్దిక్ పాండ్య తన బ్యాటింగ్ ప్రతిభను కనపరిచాడు. 72 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 78 పరుగులు చేసిన పాండ్య టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొదటి వన్డే మాదిరి ఆల్ రౌండ్ ప్రతిభ కనపరిచిన పాండ్యకే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వశమైంది. ఇక మిగిలిన రెండు వన్డేలలోనూ విజయం సాధించి, సచిన్ చెప్పిన ‘బ్లూవాష్’ తతంగం పూర్తి చేయాల్సిన బాధ్యత టీమిండియాపై ఉంది.