team-indiaప్రస్తుతం ఇండియా – పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందన్న విషయం తెలిసిందే. అయితే పైపైన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా… ఇండియాను ఎదుర్కొనే సత్తా పాకిస్తాన్ కు లేదన్నది బహిరంగ సత్యమే. ఒక్క యుద్ధంలోనే కాదు, క్రికెట్ లో సైతం పాకిస్తాన్ ను ఓ తొక్కు తొక్కడం ఖాయమని టీమిండియా నిరూపించింది. టెస్టుల్లో ఇండియా కంటే మెరుగైన ర్యాంక్ లో నెంబర్ 1గా ఉన్న పాకిస్తాన్ ను ఇండియా క్రింద పడేసేలా, కివీస్ జట్టుపై ఘనమైన విజయాన్ని అందుకుంది.

కాన్పూర్ టెస్టు మాదిరే కోల్ కతా టెస్టులోనూ సునాయాస విజయాన్ని అందుకుంది. వాస్తవానికి రెండు టెస్టులను న్యూజిలాండ్ జట్టు ఘనంగా ప్రారంభించి, బ్యాటింగ్, బౌలింగ్ లో గట్టి పోటీ ఇచ్చింది. తొలి టెస్టులో అశ్విన్, జడేజాలు భారత్ కు విజయాన్ని కట్టబెడితే, రెండో టెస్టులో భువనేశ్వర్ కుమార్, షమీ టీమిండియాకు విజయాన్ని బహుమతిగా అందజేశారు. 376 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు కేవలం 197 పరుగులకే ఆలౌట్ కావడంతో 179 పరుగుల తేడాతో టీమిండియా రెండో టెస్టును కైవసం చేసుకుంది. దీంతో మూడు టెస్టుల సిరీస్ ను 2-0తో తన సొంతం చేసుకుని, ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానాన్ని దక్కించుకుంది.

భార‌త్ సాధించిన ఘ‌న విజ‌యంతో ఇప్పటివరకు 111 పాయింట్లతో అగ్ర‌స్థానంలో ఉన్న పాకిస్థాన్ రెండో స్థానానికి ప‌డిపోయింది. ఇక మూడో స్థానంలో ఆస్ట్రేలియా (108 పాయింట్లు), నాలుగో స్థానంలో ఇంగ్లండ్‌(108), ఐదో స్థానంలో ద‌క్షిణాఫ్రికా(108), ఆరో స్థానంలో శ్రీ‌లంక(96) ఉన్నాయి. ముఖ్యంగా ఇండియా – పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపధ్యంలో పాక్ ను క్రిందకు దించడం పట్ల భారత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.