teachers union leader KR Suryanarayanaడిసెంబర్‌ ఆరో తేదీ కూడా పూర్తయింది కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులలో 40 శాతం మందికి, పెన్షనర్స్‌లో 80 శాతం మందికి జీతాలు, పెన్షన్స్ పడకపోవడంతో రేపు పలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఆయా జిల్లాలలో ధర్నాలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న కెఆర్ సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు, ఉపాధ్యాయ సంఘాల నాయకుడు సాయి శ్రీనివాస్ ఈ సమస్యపై మీడియాతో మాట్లాడారు.

కెఆర్ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, “ఉద్యోగులకు నేల్ఖరులోగా జీతాలు చెల్లించాలని నిబందనలలో ఉంది. దానిని ప్రభుత్వం 1వ తేదీకి మార్చుకొంది. అది సమస్య కాదు. కానీ 1వ తేదీన ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు చెల్లించకపోతే ఏం చేయాలనే విషయం నిబందనలలో పేర్కొనలేదు. సాధారణంగా ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగులకు, కార్మికులకు జీతాలు చెల్లించకపోతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది. కానీ ప్రభుత్వమే ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోతే? ఎవరికి మొరపెట్టుకోవాలి?

దీని కోసం మేము న్యాయనిపుణులను సంప్రదిస్తున్నాం. అసలు ఇటువంటి సమస్య వస్తుందని ఎవరూ ఊహించకపోవడం వలననే నిర్ధిష్టమైన నిబందన చేర్చలేదని భావిస్తున్నాను. కనుక ప్రతీనెల ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించేలా చేసేందుకు ఎటువంటి నియమనిబందనలు తీసుకురావాలనే దానిపై మేము చర్చిస్తున్నాము.

నేను వాణిజ్యశాఖలో మూడున్నర దశాబ్ధాలుగా పనిచేస్తున్నాను. జీఎస్టీ విధానం అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదాయం భారీగా పెరిగింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని ఆర్ధిక మంత్రివర్యులు చెపుతుంటారు. అయినా ఎందుకు అప్పులు చేస్తోంది?అని నేను ప్రశ్నించలేను కానీ ఉద్యోగులకు సకాలంలో ఎందుకు జీతాలు చెల్లించడం లేదని మాత్రం అడుగుతున్నాను.

ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు సమాజంలో ఓ స్థాయి గౌరవం ఉంటుంది. కానీ ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించకపోతే ఈఎంఐలు కట్టలేక, చివరికి పాలవాడికి ఇంటి అద్దె కట్టలేక తలదించుకోవలసివస్తోంది. ఇక పెన్షన్ మీదనే ఆధారపడి జీవిస్తున్నవారికి మరిన్ని సమస్యలు ఎదుర్కోకతప్పడం లేదు.

గత నెల కూడా జీతాలు చెల్లించడంలో చాలా ఆలస్యమైంది. ఈనెల 6వ తేదీ వచ్చినా సగం మందికి జీతాలు పడలేదు. మరో విడ్డూరం ఏమిటంటే 2017,2018లో మాకు చెల్లించాల్సిన డీఏ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వ ఆదేశం మేరకు ఆర్ధికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇంతవరకు చెల్లించనేలేదు. కానీ ఆర్ధికశాఖ ఉత్తర్వుల ఆధారంగా మాకు ఆ బకాయిలు చెల్లించేసినట్లు పరిగణించి ఆదాయపన్ను కోసేసుకొంది. జీతాలే సకాలంలో ఇవ్వలేనప్పుడు ఇక ఎరియర్స్, ఇతర డిమాండ్స్ గురించి ఏవిదంగా అడగగలము?కనుక ప్రతీ నెల ఈ జీతాల చెల్లింపు కోసం పదేపదే ప్రభుత్వాన్ని బ్రతిమాలుకోవడం మానుకొని ఈ సమస్యని తక్షణం పరిష్కరించుకోవలసిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను,” అని అన్నారు.

ఉపాధ్యాయ సంఘాల నాయకుడు సాయి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, “గత రెండు మూడు నెలలుగా జీతాలు చెల్లింపులో ఆలస్యం అవుతున్న మాట వాస్తవం. ఇక డీఏ బకాయిలు, మెడికల్ రీఎంబర్స్‌మెంట్ చెల్లింపులు వంటి ఆర్ధిక అంశాలపై ఈరోజు జరిగిన మంత్రివర్గ ఉప కమిటీ సైతం నిర్ధిష్టమైన హామీ ఇవ్వలేకపోతోంది. మార్చిలో చూద్దామని చెపుతున్నారు తప్ప నిర్ధిష్టంగా చెప్పడం లేదు. సంక్షేమ పధకాలకు బటన్ నొక్కి ఇస్తున్నారు కానీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడం లేదు. ఆర్ధికేతర అంశాలపై కూడా మేము అడిగితే వాటిని నిర్ధిష్టమైన హామీ ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదు,” అని అన్నారు.